తమ ప్రభుత్వం జనరంజక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిందని మంత్రి కొప్పుల ఈశ్వర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలకు మరింత మేలు చేసేదిగా ఉందని కొనియాడారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్‌ను కొత్తగా ప్రవేశపెట్టి రూ.1,000 కోట్లు కేటాయించడం సంతోషకరమన్నారు.
దళితులు, మైనార్టీల భద్రత, అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అంకితభావంతో ముందుకు సాగుతున్నారని చెప్పడానికి ఈ బడ్జెట్ నిదర్శనమని మంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా 2021-22 సంవత్సరంలో మైనార్టీల సంక్షేమానికి రూ. 1,606 కోట్లు కేటాయించారని గుర్తు చేశారు. ఇది గతంలో కంటే రూ.88 కోట్లు అదనమని స్పష్టం చేశారు. బడ్జెట్ పట్ల ఎస్సీ, మైనార్టీల పక్షాన సీఎంకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ మాత్రమే..
దేశంలో వ్యవసాయ రంగానికి ఇంత బడ్జెట్ కేటాయిస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.
రాష్ట్రంలో కూలీల కొరత నేపథ్యంలో వ్యవసాయ యాంత్రీకరణ కోసం రైతాంగం ఆశగా ఎదురుచూస్తున్న తరుణంలో.. రైతుబంధు, రైతుబీమా పథకాలు కొనసాగిస్తూనే వ్యవసాయ యాంత్రీకరణ పథకం అమలు కోసం రూ.1,500 కోట్లు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. వ్యవసాయంలో యాంత్రీకరణ అత్యవసరం కనుకే కేసీఆర్ ప్రత్యేకంగా ప్రతిపాదింపజేశారని వివరించారు. కరోనా కారణంగా గతేడాది ఇబ్బంది కలిగినా.. రైతుల రుణమాఫీ కోసం రూ.5,225 కోట్లు, రైతు బీమాకు రూ.1,200 కోట్లు, రైతుబంధు పథకానికి రూ.14,800 కోట్లు కేటాయించడం హర్షణీయమన్నారు. ఈ సందర్భంగా ఆయిల్‌ఫామ్ రైతులను ప్రోత్సహించేందుకు ఎకరాకు రూ.30 వేల రాయితీ ఇచ్చేందుకు రాష్ట్ర బడ్జెట్‌లో నిధుల కేటాయింపులు చేసినట్లు ప్రకటించారు.