రాష్ట్రంలో 2.83 లక్షల ఇళ్లు మంజూరైతే.. 2 లక్షల ఇళ్లకు టెండర్లు ఫైనల్ అయ్యాయని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. మొత్తం 31,300 ఇళ్లు పూర్తయ్యాయని స్పష్టం చేశారు. 1.10 లక్షల ఇళ్లు 3 నెలల్లో పూర్తయ్యే అవకాశం ఉందని.. 30 వేల ఇళ్లు ప్రారంభ దశలో ఉన్నాయన్నారు. ఇప్పటి వరకు ఈ నిర్మణాలకు రూ.7,800 కోట్లు ఖర్చు పెట్టామని పేర్కొన్నారు.
హైదరాబాద్‌లో గృహనిర్మాణం వేగంగా జరుగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో అనుకున్నంత వేగంగా జరగట్లేదు. అత్యాధునిక సాంకేతికతతో రెండు పడక గదుల ఇళ్లు కట్టిస్తున్నాం. టన్నల్ ఫామ్ టెక్నాలజీతో రాంపల్లి వద్ద 6 వేల ఇళ్లు కట్టాం. కేంద్రం ఇచ్చిన నిధులను మళ్లించే ప్రయత్నం చేస్తున్నామని ప్రచారం చేస్తున్నారు. గృహనిర్మాణంలో ఇప్పటివరకు అయిన ఖర్చులో రాష్ట్రం వాటా 83 శాతం. ఇప్పటి వరకు ఖర్చైన దానిలో కేంద్రం వాటా 17 శాతమే. రెండున్నరేళ్లలో కొల్లూరులో 115 ఎకరాల్లో దాదాపు 15,630 ఇళ్లు నిర్మించాం. మేడ్చల్‌లో ఒకేచోట 4,420 ఇళ్లను కట్టిస్తున్నాం. పటాన్‌చెరులో ఒకే ప్రదేశంలో 2052 ఇళ్లు కట్టిస్తున్నాం.
-వేముల ప్రశాంత్ రెడ్డి, మంత్రి
రాష్ట్ర జీడీపీ వృద్ధికి రెండు పడకగదుల ఇళ్ల నిర్మాణం ఉపకరిస్తోందని మంత్రి వేముల పేర్కొన్నారు. 27 వేల మంది కార్మికులు గ్రామీణ ప్రాంతాల్లో గృహ నిర్మాణం ద్వారా ఉపాధి పొందుతున్నారని తెలిపారు. సొంత స్థలాలు ఉన్న వారికి లక్ష మందికి ఇళ్లు కట్టివ్వాలని సీఎం నిర్ణయించారని స్పష్టం చేశారు. రెండు పడకల ఇళ్ల నిర్మాణానికి రూ.7500 కోట్లు నేరుగా.. రూ.3 వేల కోట్లు ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కింద నిధులు కేటాయించారని మంత్రి ప్రశాంత్ రెడ్డి తెలిపారు.