నిరుపేదలకు వందశాతం రాయితీతో రెండు పడకగదుల ఇళ్లను నిర్మించి ఇవ్వాలన్నదే.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన ఎజెండా అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి(Vemula at TS Council) స్పష్టం చేశారు. రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వ స్థలాలు దొరకడం లేదని.. అందుకే కొందరు లబ్ధిదారులకు కేటాయింపు జరగలేదని మంత్రి వేముల (Vemula at TS Council) పేర్కొన్నారు. ప్రభుత్వ భూముల సమస్య ఉన్న ప్రాంతాల్లో.. ఇళ్ల స్థలాలు ఉన్న వారు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టుకునేందుకు ఆర్థిక సాయం చేసేందుకు సీఎం కేసీఆర్ సుముఖంగా ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పురోగతి, ఇళ్ల స్థలాలు ఉన్న పేదలకు ఆర్థిక సాయం చేయాలని విజ్ఞప్తి చేస్తూ మండలి సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి వేముల(Vemula at TS Council) సానుకూలంగా స్పందించారు.
ప్రతి యేటా కొన్ని ఇళ్లు
తెరాస రెండోసారి అధికారంలోకి వచ్చిన ఈ రెండున్నరేళ్ల కాలంలో కరోనా మహమ్మారి కారణంగా ఆర్థిక సంక్షోభం ఏర్పడిందని వేముల అన్నారు. రెవెన్యూ ఇబ్బందుల కారణంగానే పలు పథకాలు ఆలస్యమయ్యాయని చెప్పారు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ రెండు పడక గదుల(Vemula at TS Council) ఇళ్ల కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని.. ఇళ్ల స్థలాలు ఉండి పథకానికి అర్హులైన వారికి ఆర్థిక సాయం చేసేందుకు మార్గదర్శకాలతో పాటు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు వివరించారు. కేసీఆర్ ఆదేశానుసారం ఆయా జిల్లాల కలెక్టర్ల నేతృత్వంలో పారదర్శకంగా, రాజకీయాలకతీతంగా లబ్ధిదారులను ఎంపిక చేసి.. ప్రతి యేటా కొన్ని ఇళ్లు పూర్తి చేస్తామని చెప్పారు.
సమగ్ర కుటుంబ సర్వే ద్వారా... 26,31,739 మందికి ఇళ్లు లేవని తేలింది.బడ్జెట్లో ఇప్పటి వరకు 2లక్షల 91 వేల ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ. 18వేల కోట్లు కేటాయించింది. 2లక్షల 27వేల ఇళ్ల పనులు మొదలుపెట్టాం. లక్షా 3వేల ఇళ్లు పూర్తయ్యాయి. మరో 70వేల ఇళ్లు 90శాతం పూర్తిచేసుకున్నాయి. ఇంకో 53వేల ఇళ్లు పురోగతిలో ఉన్నాయి. ఇప్పటి వరకు రూ. 10వేల 442 కోట్లు ఖర్చు కాగా కేంద్రం ఇచ్చింది కేవలం రూ. 1,311 కోట్లు మాత్రమే. కేంద్రం ఇచ్చిన వాగ్దానం ప్రకారం మరో రూ.1,375 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఇళ్ల స్థలాలు ఉన్న వారికి రూ. 2,316 కోట్లు కేటాయించాం. -వేముల ప్రశాంత్ రెడ్డి, రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి
రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి మొత్తం కేంద్రమే భరిస్తోందని.. భాజపా నేతలు చెబుతున్నది అవాస్తవమని మంత్రి అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో ఇంటికి రూ. 5లక్షల 4వేలు ఖర్చవుతుంటే.. కేంద్రం ఇస్తుంది రూ. 72వేలు మాత్రమే అని చెప్పారు. పట్టణ, మున్సిపల్, జీహెచ్ఎంసీ ప్రాంతాల్లో రూ. 5లక్షలు, రూ. 7లక్షల చొప్పున ఖర్చవుతుంటే కేంద్రం కేవలం రూ. లక్షా 50వేలు మాత్రమే ఇస్తోందని పేర్కొన్నారు. మిగతా మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోందని వివరించారు. .
ఇదీ చదవండి: KTR at TS Council: 'ఎలక్ట్రిక్ వాహన రంగంలో రాష్ట్రానికి రూ.5, 600 కోట్లు వచ్చాయి'