ఏపీలో రామతీర్థంలో ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టాలని చూస్తే ఊరుకోబోమని ఆ రాష్ట్ర మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. మతాలంటే ఇష్టమొచ్చినట్లు మాట్లాడే పవన్ కల్యాణ్‌తో భాజపా ఎప్పుడైతే పొత్తు పెట్టుకుందో.. నాటి నుంచే తమకు వారిపై గౌరవం పోయిందన్నారు. విజయవాడ టూ టౌన్లో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. తెదేపా హయాంలో మంత్రి మాణిక్యాలరావు నియోజకవర్గంలో రథం తగలబడినప్పుడు భాజపా నేతలు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో దేవాలయాలపై రాజకీయాలు జరగటం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.
మీ దగ్గర చూసుకోండి...
ఏపీలో జరుగుతున్న పరిణామాలపై సోమవారం భాజపా తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి వెల్లంపల్లి స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌లో అంతా బాగానే ఉందని.. ఏమైనా ఉంటే తెలంగాణలో చూసుకోవాలని హితవు పలికారు.
'బండి సంజయ్... ఏమైనా ఉంటే తెలంగాణలో చూసుకోండి. ఈ రాష్ట్రంలో మీకేం పని లేదు. ఏపీలో పరిపాలన అంతా బాగానే ఉంది. మీ వ్యాఖ్యలు ఇక్కడ అవసరం లేదు. ఏమైనా ఉంటే తెలంగాణలో చూసుకుని బాగుపడండి '- వెల్లంపల్లి శ్రీనివాస్, ఏపీ దేవాదాయశాఖ మంత్రి
ఇదీ చదవండి: 'సభ్య సమాజానికి కేసీఆర్ ఏం మెసేజ్ ఇస్తున్నట్టు?'