హైదరాబాద్ జంట నగరాల్లో అర్హులైన లబ్ధిదారులకు వచ్చే వారం నుంచి కొత్త రేషన్‌కార్డులను పంపిణీ చేయనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. త్వరలో మరో 32 నూతన చౌక ధరల దుకాణాల ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీకి చర్యలు చేపడుతున్నట్లు స్పష్టం చేశారు. మాసబ్‌ట్యాంక్‌లోని తన కార్యాలయంలో రేషన్‌కార్డుల పంపిణీపై హోం మంత్రి మహమూద్ అలీతో కలిసి ఆయన సమీక్షించారు.
హైదరాబాద్ జిల్లా పరిధిలో 1.77 లక్షల దరఖాస్తులు రాగా.. 44,734 కార్డుల పంపిణీ జరిగిందని.. ఇంకా 5,323 కార్డులు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని తలసాని పేర్కొన్నారు. మరో 99,014 దరఖాస్తులు పరిశీలించాల్సి ఉందని వివరించారు. జంట నగరాల్లో మొత్తం 670 రేషన్ దుకాణాలకు గానూ ప్రస్తుతం 613 దుకాణాలు పని చేస్తున్నాయని.. రేషన్ డీలర్లు మరణించిన కారణంగా 25 దుకాణాలు పని చేయడం లేదన్నారు. త్వరలో వారి కుటుంబసభ్యులను సంప్రదించి దుకాణాలు తెరిచేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ప్రస్తుతం హైదరాబాద్ జిల్లా పరిధిలో ఉన్న 5,80,584 రేషన్‌కార్డులకు గానూ ఒక్కొక్కరికి 15 కిలోల చొప్పున ఉచితంగా బియ్యం పంపిణీ కోసం 33 వేల మెట్రిక్ టన్నుల బియ్యం మంజూరు చేశామని మంత్రి తలసాని వివరించారు. రేషన్‌కార్డుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సమావేశంలో పౌర సరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్, మేయర్ గద్వాల విజయలక్ష్మి, కలెక్టర్ శ్వేతా మహంతి, చీఫ్ రేషనింగ్ అధికారి బాల మాయాదేవి, హైదరాబాద్ జిల్లా సివిల్ సప్లై అధికారి రమేశ్ తదితరులు పాల్గొన్నారు.