రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతో మత్స్యకారులు ఎంతో సంతోషంగా ఉన్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. మాసాబ్ ట్యాంక్‌లోని తన కార్యాలయం నుంచి మత్స్యశాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యాతో కలిసి అన్ని జిల్లాల... మత్స్యశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
కలెక్టర్లను సంప్రదించండి..
రాష్ట్రంలో మత్స్య సంపద భారీగా పెరిగిందని, అందుకు అనుగుణంగా మార్కెటింగ్ చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. రాబోయే రోజులలో చేపలను ఇతర దేశాలకు ఎగుమతులు చేసే స్థాయికి రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుందన్న ధీమాను వ్యక్తం చేశారు. ప్రతి జిల్లా కేంద్రంలో, మున్సిపాలిటీలలో చేపల మార్కెట్ల నిర్మాణాలు చేపట్టేందుకు స్థల సేకరణ కోసం... జిల్లాల కలెక్టర్లను సంప్రదించాలని సూచించారు.
ఫిష్ ఔట్లెట్స్
జీహెచ్‌ఎంసీ పరిధిలోని ప్రజలకు చేపలను అందుబాటులోకి తీసుకెళ్ళే ఆలోచనతో డివిజన్‌కు ఒకటి చొప్పున 150 మొబైల్ ఫిష్ ఔట్ లెట్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలలో కూడా మొబైల్ ఫిష్ ఔట్ లెట్స్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. నాలుగు సంవత్సరాల నుంచి రాష్ట్రంలోని అన్ని నీటి వనరులలో ఉచితంగా చేప పిల్లలు, రొయ్య పిల్లలను విడుదల చేస్తున్నట్లు వివరించారు. త్వరలోనే మత్య్సకారుల సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు.
ఇదీ చూడండి: జనవరిలోనే పదోన్నతులు, వేతన సవరణ: సీఎం కేసీఆర్