విజయ డెయిరీలో సభ్యత్వం ఉండి, పాలు పోయని రైతుల సభ్యత్వాలు రద్దు చేయడానికి ప్రభుత్వం వెనకాడదని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. పాలు పోయని రైతుల సమాచారం తెప్పించాలని జిల్లా అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్ పశుసంవర్ధక శాఖ సమావేశ మందిరంలో విజయ డెయిరీ ఛైర్మన్ లోక భూమా రెడ్డి అధ్యక్షతన జరిగిన 10వ బోర్డు సమావేశానికి మంత్రి తలసాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పాడి రైతులను ప్రోత్సహించేందుకు లీటరు పాలపై 4 రూపాయల ప్రోత్సాహకం ఇస్తున్నా కొందరు రైతులు ప్రైవేట్ డెయిరీలకు పాలు విక్రయిస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు.
కొందరు సొసైటీల సభ్యులు ప్రైవేట్ డెయిరీలకు పాలు పోసేలా రైతులను ప్రోత్సహిస్తున్న దృష్ట్యా... అలాంటి వ్యక్తులను గుర్తించి కఠినంగా వ్యవహరించాలని మంత్రి తలసాని ఆదేశించారు. అవసరమైతే స్పెషల్ డ్రైవ్ నిర్వహించి సొసైటీల ప్రక్షాళన చేయాలని సూచించారు. కొత్తగా పాలు పోసేందుకు ముందుకొచ్చే రైతులకు సభ్యత్వాలు ఇవ్వడం ద్వారా పాల సేకరణ పెంపునకు కృషి చేయాలని చెప్పారు.
విజయ డెయిరీ ఉత్పత్తులకు విస్తృత ప్రచారం కల్పించి ప్రైవేట్ డెయిరీలకు దీటుగా విక్రయాలు పెంచేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి సూచించారు. ఉమ్మడి జిల్లాల వారీగా రాష్ట్రాన్ని 4 జోన్లుగా విభజించి జోన్‌కు ఒకరు చొప్పున ప్రత్యేక అధికారిని నియమించాలని ఆదేశించారు.