గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నాలాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. వర్షాకాల సన్నద్ధతపై మంత్రి మహమూద్ అలీతో కలిసి జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులతో తలసాని సమీక్షించారు. 1360 కిలోమీటర్ల మేర 45 కోట్ల వ్యయంతో ప్రతి ఏటా నాలాల్లో పూడికతీత పనులు చేస్తున్నామని మంత్రి తెలిపారు. పూడికతీత కోసం త్వరలోనే యంత్రాలు సమకూర్చుతామన్నారు. కొన్నిచోట్ల నాలాలపై అక్రమ నిర్మాణాలు చేపట్టారని.. వాటిని గుర్తించి తొలగిస్తామన్నారు. నివాసం కోల్పోతున్న వారికి పునరావాసం కల్పిస్తామని.. చెరువుల ఆక్రమణలు కూడా తొలగిస్తామని తలసాని వివరించారు.
నగరంలో సాధ్యమైనంత వరకు ట్రాఫిక్ కష్టాలు లేకుండా చర్యలు చేపట్టామన్నారు. ఎల్బీ నగర్ రింగ్‌రోడ్ వద్ద ట్రాఫిక్ కష్టాలు పరిష్కరించామని.. త్వరలోనే ఉప్పల్ రింగ్‌రోడ్ వద్ద ట్రాఫిక్ సమస్యలు లేకుండా చేస్తామని తలసాని వివరించారు. రహదారులు, ఫుట్‌పాత్‌లు, పార్కుల అభివృద్ధిపైనా చర్చించామని సమావేశం అనంతరం తలసాని వెల్లడించారు.
ఇదీ చదవండి: ఎంపీ నామా నాగేశ్వరరావు ఇంట్లో ఈడీ సోదాలు