రాష్ట్రంలో అమలవుతున్న గొర్రెల పంపిణీ పథకానికి కేంద్రం రూ.1000 కోట్లు సబ్సిడీ ఇచ్చిందని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని రాష్ట్ర పశు, సంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(talasani srinivas yadav) ఎద్దేవా చేశారు. గొర్రెల పథకంపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (BJP state president Bandi Sanjay) చేసిన వ్యాఖ్యలపై ఆయన వివరణ ఇచ్చారు. మన రాష్ట్రంలో 2017లో ప్రవేశ పెట్టిన గొర్రెల పంపిణీ పథకం దేశంలో ఎక్కడా లేదన్నారు. ఒక ఎంపీగా, ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా అసత్యాలు ప్రచారం చేయడం తగదని మంత్రి హితవు పలికారు. వరిధాన్యం కొనుగోళ్ల విషయంలోనూ అబద్ధాలు మాట్లాడుతున్నారని తలసాని విమర్శించారు. హైదరాబాద్ మాసాబ్ ట్యాంక్‌లోని పశు సంక్షేమ భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు.
రాష్ట్రంలోని గొల్ల, కురుమలకు గొర్రెల పంపిణీ పథకం ప్రారంభమైనప్పుడు 1000 కోట్ల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చిన కేంద్రం నెరవేర్చలేదని మంత్రి తెలిపారు. ఈ పథకం కింద మొదటి విడతలో ప్రభుత్వం పూచీకత్తుపై ఎన్‌సీడీసీ (NCDC)ద్వారా రూ.3549.98 కోట్లు రుణం తీసుకున్నామని తెలిపారు. ఆ అప్పు సంబంధించి ఇప్పటిదాకా అసలు, వడ్డీ కలిపి 9 వాయిదాల్లో రూ.2900.74 కోట్ల రూపాయలు ఎన్‌సీడీసీకి(NCDC) చెల్లించామని మంత్రి స్పష్టం చేశారు.
రెండో విడత అమలు కోసం లబ్ధిదారుల వాటా మినహాయించి రూ.4593.75 కోట్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశామని తెలిపారు. అనంతరం ఎన్‌సీడీసీ అధికారుల బృందం క్షేత్రస్థాయి పర్యటనకు విచ్చేసి సంతృప్తి వ్యక్తం చేయడమే కాకుండా రుణం ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిందన్నారు. ఇంత గొప్పగా ఈ పథకం అమలవుతున్న తరుణంలో బండి సంజయ్ ఎందుకు అబద్ధాలు మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని మండిపడ్డారు. అబద్ధాలు మాట్లాడే వ్యక్తిని భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా ఎందుకు నియమించారో కేంద్రం ఆలోచించాలని హితవు పలికారు. యాసంగి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా అబద్ధాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. ధాన్యం కొనుగోలు అంశం రాజ్యాంగంలో పొందుపరిచి ఉందని గుర్తు చేశారు. ధాన్యం కొనుగోలు అంశం సహా ఏ విషయాన్నైనా రాజకీయం చేయడం భాజపా నేతలకు తగదన్నారు. భాజపా నేతల అసత్యపు ప్రచారాలతో ఆ ప్రభావం కేంద్రంపైనే పడుతుందని మంత్రి తలసాని (talasani srinivas yadav)పేర్కొన్నారు
రాష్ట్రంలో గొల్ల, కురుమలు గొర్రెల పంపిణీ కార్యక్రమం దేశంలో ఊహించని పరిణామం. 35 లక్షల కుటుంబాలకు సంబంధించిన ఇంత పెద్ద స్కీమ్ మనదేశంలో ఎక్కడా లేదు. సీఎం కేసీఆర్ పదేపదే చెప్తుర్రు. మన రాష్ట్రానికి వందల లారీలలో గొర్రెలు వస్తున్నాయి. మన వద్దనే గొర్రెలు ఉండాలనే చెప్పిండ్రు. మనం ఒకరిపై ఆధాపపడొద్దు. ఒక పద్ధతి ప్రకారం చేయాలని చెప్పారు. నిన్న, మొన్న బండి సంజయ్ అనే వ్యక్తి. ఒక పార్లమెంట్ మెంబర్ అయి ఉండి.. బాధ్యత కలిగిన వ్యక్తి 1000 కోట్ల రూపాయల సబ్సిడీ ఇచ్చామని అబద్ధాలు చెప్పడం దుర్మార్గమైన చర్య. ఇలాంటి వ్యక్తులను భాజపా ఎందుకు అధ్యక్షునిగా పెట్టుకుందో సమాధానం చెప్పాలి. మీకు తెలియకపోతే పేపర్లు, టీవీలు, కేంద్రాన్ని అడిగైనా తెలుసుకోవాలి. ఏ ఆధారాలు లేకుండా జనం మధ్యలో అబద్ధాలు చెప్పడం ఆయనకు పరిపాటి అయిపోయింది. వరిధాన్యం కొనుగోళ్లలోనూ అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. మన రాష్ట్రంలో ఏ సంక్షేమ పథకం తీసుకున్నా కూడా మనం ప్రథమ స్థానంలో ఉంటాం. బాధ్యత గల వ్యక్తులు నిజాలు మాట్లాడాలి. చిల్లరగా మాట్లాడటం సరికాదు. ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులు తమ బాధ్యతను విస్మరించి మాట్లాడకూడదు.-
తలసాని శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర పశు, సంవర్ధకశాఖ మంత్రి
ఇదీ చూడండి: