రాష్ట్రంలో పాడి రంగం ద్వారా రైతులను బలోపేతం చేయడం కోసం ప్రభుత్వం పలు సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను చేపడుతోందని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాద్ మసబ్ ట్యాంక్ వద్ద తన కార్యాలయంలో పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమ, పశుగణాభివృద్ధి శాఖల పనితీరును మంత్రి సమీక్షించారు. ఈ శాఖల ఆధ్వర్యంలో అమలు చేస్తున్న పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు.
అవగాహన కల్పించాలి:
నేటి నుంచి 23వ తేదీ వరకు జరగనున్న 'గో జాతి, గేదె జాతి పశువుల్లో ఉచిత నట్టల నివారణ' కార్యక్రమాన్ని మంత్రి చేతుల మీదుగా ప్రారంభించారు. అందుకు సంబంధించిన గోడ పత్రికలు, కరపత్రాలను మంత్రి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయడంతోపాటు పశుపోషకులకు పెంపకంపై శాస్త్రీయపరమైన అవగాహన కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు.
టీకాలు ఇస్తున్నాం:
రాష్ట్రంలో గో, గేదె జాతి పశువుల సంఖ్య 68.18 లక్షలు ఉండగా.. వాటి పెంపకంపై ఆధారడి జీవిస్తున్న కుటుంబాల సంఖ్య 22.5 లక్షల మంది ఉన్నారని పశుసంవర్థక శాఖ సంచాలకులు లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. ఈ రంగం బలోపేతానికి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. పశువుల్లో రోగాల నిర్మూలన, ఉత్పత్తి, పునరుత్పత్తి సామర్థ్యం పెంపొందేందుకు టీకాలు ఇస్తున్నామని లక్ష్మారెడ్డి పేర్కొన్నారు.
కార్యక్రమంలో పశుసంవర్థక శాఖ కార్యదర్శి అనితా రాజేంద్ర, సంచాలకులు డా.వంగాల లక్ష్మారెడ్డి, రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ సీఈఓ డా.మంజువాణి, తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సంస్థ ఎండీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: 'డీపీఆర్లు ఎందుకివ్వరు?.. ప్రాజెక్టుల పేరుతో దోచుకుంటున్నారు'