రాష్ట్రంలో జీవాల పెంపకందారులకు సర్కారు అండగా ఉంటుందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అన్నారు. హైదరాబాద్ మాసాబ్ ట్యాంక్‌లోని తన కార్యాలయంలో పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమశాఖల ఉన్నతాధికారులతో మంత్రి సమీక్షించారు.
ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అనిత రాజేంద్ర, డైరెక్టర్ డాక్టర్ లక్ష్మారెడ్డి, అడిషనల్ డైరెక్టర్ రాంచందర్, డెయిరీ ఎండీ శ్రీనివాసరావు, టీఎస్‌ఎల్‌డీఏ సీఈఓ డాక్టర్ మంజువాణి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా వర్షాలు కురుస్తున్నందున జలాశయాలు, చెరువులు, ఇతర నీటి వనరుల్లోకి వరద నీరు పోటెత్తుతుండటం, పశుజీవాలు, మత్స్య సంపదకు నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు, సీజనల్ వ్యాధులు సోకుండా తీసుకోవాల్సిన చర్యలు, బీమా, ప్రీమియం, క్లైమ్‌ల చెల్లింపులు వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.
వివిధ రకాల ప్రమాదాలతో జీవాలు మరణించిన సందర్భాల్లో పెంపకందారులు ఆర్థికంగా ఎంతో నష్టపోతున్న దృష్ట్యా... ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని మంత్రి తెలిపారు. జీవాల పెంపకంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న కుటుంబాలను ప్రోత్సహించే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనల మేరకు అర్హులైన లబ్ధిదారులకు ఇప్పటికే గొర్రెలు, పాడి గేదెలు రాయితీపై అందజేశామని చెప్పుకొచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో జీవాలకు ప్రభుత్వం బీమా ప్రీమియం చెల్లిస్తున్న దృష్ట్యా... అవి మరణిస్తే బీమా పరిహారం కింద కొత్త జీవం కొనుగోలు చేసి లబ్ధిదారుడికి అందిస్తున్నట్లు చెప్పారు. అదే విధంగా ప్రభుత్వం అందించిన జీవాలు కాకుండా రైతుల వద్ద ఉన్న తమ సొంత గొర్రెలు, పాడి గేదెలకు రోడ్డు ప్రమాదాలు, పిడుగుపాటు వంటి పలు ప్రమాదాల బారినపడి చనిపోయిన సమయాల్లో ఆర్ధికంగా ఎంతో నష్టపోతున్నారని... అలాంటి సంఘటనల నుంచి ఆదుకోవాలనేది కూడా తమ ఉద్దేశ్యమని తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వం 80 శాతం, రైతులు 20 శాతం వాటా ప్రీమియంతో ఇన్సురెన్స్ వర్తింపచేసేలా చర్యలు చేపట్టినట్లు ప్రకటించారు.
అక్టోబర్ 15 నుంచి ఆయా జిల్లాల పశుసంవర్ధక శాఖల కార్యాలయాల్లో రైతులు స్వయంగా దరఖాస్తు చేసుకునే విధంగా ఏర్పాట్లు చేయాలని మంత్రి తలసాని ఉన్నతాధికారులను ఆదేశించారు.
ఇదీ చదవండి: భారీ వర్షం.. రాకపోకలకు తీవ్ర అంతరాయం