రాష్ట్రంలో మత్స్య రంగాన్ని మత్స్యకారులను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం... ఇక నుంచి పందుల పెంపకానికి కూడా మంచి చేయూత ఇవ్వనున్నట్లు పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అన్నారు. హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్ పశుసంవర్థక శాఖ కార్యాయలంలో మత్స్య రంగం అభివృద్ధి, పందుల పెంపకం సంబంధించి బ్రీడింగ్ విధానంపై మంత్రి వేర్వేరుగా సమీక్షించారు.
వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, ఎంపీ బండ ప్రకాష్, ఎమ్మెల్యే ముఠా గోపాల్, అటవీ సంస్థ ఛైర్మన్ ప్రతాప్‌రెడ్డి, పశుసంవర్థక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, సంచాలకులు డాక్టర్ లక్ష్మారెడ్డి, మత్స్య శాఖ కమిషనర్ డాక్టర్ సువర్ణ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల ప్రతినిధులు, ఎరుకల సహకార సంఘాల ప్రతినిధులు సమావేశానికి హాజరయ్యారు. ఆయా రంగాల అభివృద్ధిపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాల జీవనోపాధులు పెంపు, ప్రభుత్వపరంగా పథకాలు, ఇవ్వాల్సిన ఆర్థిక చేయూత వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలన్న లక్ష్యంతో వ్యవసాయ అనుబంధ పౌల్ట్రీ రంగం తరహాలో రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఎరుకల కుటుంబాలకు అన్ని రకాలుగా మద్ధతు ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రి తలసాని ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా... ప్రత్యేకించి విదేశీయ, స్థానిక మార్కెట్‌లో పంది మాంసానికి మంచి డిమాండ్ ఉన్న దృష్ట్యా... అవసరమైన రాయితీలు, ప్రోత్సాహకాలపై కసరత్తు చేయనున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: జనపనారతో సంచుల తయారీ... ఇంటివద్దే ఉపాధి