Talasani on Chandrababu Naidu Arrest : చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో తాజా పరిణామాలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. అధికార బలంతో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడ్ని అరెస్టు చేయడం చాలా బాధాకరమని తెలంగాణ రాష్ట్ర పశుసంవర్థక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. వ్యక్తిగతంగా తనకెంతో బాధ కలగచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
Minister Talasani Respond on Naidu Arrest : ఒకప్పుడు కేంద్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన సీనియర్ నేత చంద్రబాబు పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు విచారకరం అని వ్యాఖ్యానించారు. 73 ఏళ్ల వయసులో ఉన్న బాబును అరెస్ట్ చేయడం, విచారణ పేరిట 26 రోజులుగా ఇబ్బందులకు గురిచేయడం ఏ మాత్రం సరికాదని అన్నారు. కనీసం ఆయన హోదా, వయస్సుకైనా సరే గౌరవం ఇవ్వాల్సిందని.. విచారణ అంటే సరైన పద్ధతులు ఉంటాయని చెప్పారు.
పెద్ద నేత అరెస్ట్ అంటే ఓ ప్రొసీజర్ ఉంటుందని.. ఈ విషయంలో ఏదీ కూడా పాటించడం లేదని.. ఇది సరైన పద్ధతి కాదని ఆక్షేపించారు. అధికారం ఉంది కదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే అంటే ఎలా కుదురుతుంది..? ఇవాళ అధికారం ఉంటుంది.. రేపు మరొకరు అధికారంలో వస్తారు.. అప్పుడేంటి పరిస్థితి అని సూటిగా ప్రశ్నించారు. ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయకత్వంలో తాను మంత్రిగా పనిచేశానని మంత్రి తలసాని పేర్కొన్నారు.
"మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అరెస్టు చేయడం చాలా బాధాకరం. అధికారం శాశ్వతం కాదు. ఒకప్పుడు కేంద్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన చంద్రబాబు పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు విచారకరం. విచారణ పేరిట 26 రోజులుగా ఇబ్బందులకు గురి చేయడం ఏ మాత్రం సరికాదు. కనీసం ఆయన హోదా, వయస్సుకైనా గౌరవం ఇవ్వాల్సింది". - తలసాని శ్రీనివాస్ యాదవ్, మంత్రి
Telangana Ministers on Chandrababu Arrest : చంద్రబాబు అరెస్ట్‌పై మంత్రి హరీశ్‌రావు స్పందించారు. ఈ వయసులో చంద్రబాబును అరెస్టు చేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు. రాజకీయాల్లో కక్ష సాధింపు చర్యలు మంచివి కావని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, పోచారం శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఉద్దేశపూర్వకంగా అరెస్ట్ చేశారని దుయ్యబట్టారు. అంతకు ముందు తెలంగాణ బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్ కూడా చంద్రబాబు అరెస్టును ఖండించారు. అలాగే తెలంగాణ కాంగ్రెస్ నుంచి భట్టి విక్రమార్క స్పందించారు.
Harish Rao on Chandrababu Arrest : 'ఈ వయసులో చంద్రబాబును అరెస్టు చేయడం దురదృష్టకరం'