TRS vs BJP: కేంద్ర ప్రభుత్వాన్ని రద్దు చేస్తే.. వెంటనే దేశ వ్యాప్త ఎన్నికలకు తెరాస సిద్ధమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. అధికారంలో ఉన్నారని ఇష్టారీతిన వ్యాఖ్యలు సరికాదని హితవు పలికారు. ఒకేసారి ఎన్నికలకు వెళ్దాం.. ఎవరు గెలుస్తారో ప్రజలు నిర్ణయిస్తారని కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను ఉద్దేశించి తలసాని అన్నారు. హైదరాబాద్ సనత్‌నగర్‌లోని బండమైసమ్మనగర్‌లో రూ.27.50 కోట్లతో నిర్మించిన రెండు పడక గదుల ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రి ప్రశాంత్‌రెడ్డితో కలిసి తలసాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా తుక్కుగూడ బహిరంగ సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ఘాటైన విమర్శలు చేశారు.
మా వెంట వస్తే ఇళ్లు చూపిస్తాం.. గుజ్‌రాత్‌లో రెండు పడక గదులు ఇళ్లు ఎందుకు నిర్మించలేదని మంత్రి తలసాని ప్రశ్నించారు. రెండు పడక గదుల ఇళ్లు నిర్మించలేదనే వారు.. తమ వెంట వస్తే భవనాలు చూపెడతామని తలసాని అన్నారు. పేదల సొంతింటి కల నెరవేరుస్తున్న సీఎం.. కేసీఆర్ అంటూ ప్రశంసించారు. మంత్రి పదవులన్నీ కేసీఆర్ కుటుంబానికే అన్న అమిత్ షా వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి.. మిగతా మంత్రులకు ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. కేంద్ర మంత్రి హోదాలో అమిత్ షా ఇలా మాట్లాడటం సరికాదని హితవు పలికారు.
'దేశవ్యాప్త ఎన్నికలకు మేము కూడా సిద్ధంగా ఉన్నాం. ఎవరు గెలుస్తారో తేల్చుకుందాం. మీ తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడరు. కొందరు ఏడ్చుకుంటూ మాట్లాడారు. మరికొందరు నవ్వుతూ మాట్లాడారు. వారేం మాట్లాడుతున్నారో వారికే అర్థం కావడం లేదు. డబుల్ బెడ్ రూం ఇళ్ల గురించి భాజపా నాయకులు మాట్లాడారు. మా వెంట రండి మేం చూపిస్తాం.' -తలసాని శ్రీనివాస్ యాదవ్, పశు సంవర్థక శాఖ మంత్రి
"తెలంగాణకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, మెడికల్ కాలేజీ, నవోదయ పాఠశాలలు ఎందుకివ్వలేదో అమిత్ షా సమాధానం చెప్పాలి. పెట్రోల్, గ్యాస్, నిత్యావసరాల ధరల పెంపుతో పేదలు బతకడం కష్టతరంగా మారింది. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం చేపట్టాం. గుజరాత్‌లో ఇలాంటివి నిర్మించారా.? దేశ సంపదను మొత్తం అదానీ, అంబానీలకు దోచిపెడుతున్నారు." -ప్రశాంత్ రెడ్డి, రోడ్లు భవనాల శాఖ మంత్రి
దేశ సంపదను ప్రధాని మోదీ అదానీ, అంబానీలకు దోచిపెడుతున్నారని మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. తమ ప్రభుత్వం పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేస్తోందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, కలెక్టర్ శర్మన్ తదితర అధికారులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి: 'కేసీఆర్ తెలంగాణ గాంధీ.. భాజపా బోగస్ మాటలను ప్రజలు నమ్మరు'
త్రిపుర సీఎంగా మాణిక్ సాహా ప్రమాణ స్వీకారం
Amith shah On CM Kcr: ఇంత అసమర్థ సీఎంను నేనెప్పుడూ చూడలేదు: అమిత్ షా