300 ఏళ్ల క్రితమే బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారాన్ని సాధించి చూపించిన గొప్ప చక్రవర్తి... సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని... ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. భాష సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహరాజ్ 370వ జయంతి ఉత్సవాలను హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహించారు. ఆయన చిత్ర పటానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, మాజీ ఎంపీ బుర్ర నర్సయ్య గౌడ్ పూలమాల వేసి నివాళులర్పించారు.
పాపన్న గౌడ్ బడుగు బలహీన వర్గాలను ఐక్యం చేసి... సామాన్య కల్లు గీత కార్మికుని నుంచి చక్రవర్తి వరకు ఎదిగి దిల్లీ పాలకులను ఎదిరించిన వీరుడని మంత్రి పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పాపన్న చరిత్రను నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఆయన చారిత్రక కట్టడాలను, కోటలను సంరక్షించి పర్యాటక, పురావస్తు శాఖ కేంద్రాలుగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఆయన జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చినట్లు చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో వివక్షకు గురైన కుల వృత్తులను కేసీఆర్ అభివృద్ధి చేస్తున్నారని... రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నీరా ప్రాజెక్టుకు ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకువస్తామని శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: ఉగ్ర గోదావరి.. కొనసాగుతోన్న మూడో ప్రమాద హెచ్చరిక