కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే బీసీ గణన చేయడం లేదని క్రీడా, పర్యాటక, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud On Bc Census) ఆరోపించారు. ప్రధానిగా బీసీగా ఉన్నప్పటికీ.. బీసీగణన చేయడం లేదన్నారు. భాజపా పాలిత రాష్ట్రాలు కూడా బీసీ జనగణనను కోరుకుంటున్నాయని మంత్రి పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 5 వేల 236 బీసీ జాతులు ఉండగా.. వాటిలో కొన్ని గుర్తింపునకు నోచుకోవడం లేదని శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.
రిజర్వేషన్లు పెంచుకునే అవకాశం రాష్ట్రాలకు ఇస్తామన్న కేంద్రం.. బీసీ జనగణన చేసుకునే అవకాశం రాష్ట్రాలకు ఎందుకు ఇవ్వడం లేదని మంత్రి ప్రశ్నించారు. రాష్ట్రంలో సమగ్ర సర్వేతో బీసీ జనాభాపై స్పష్టమైన లెక్కలు వచ్చాయని.. దానివల్లే ప్రభుత్వం తగిన బడ్జెట్ కేటాయించగలుగుతోందన్నారు. సుమారు 70 కోట్ల జనాభా ఉన్న బీసీలకు కేంద్రంలో మంత్రిత్వశాఖ లేదన్నారు.
బీసీ జనగణన జరగపోతే వాళ్ల ఆర్థిక స్థితిగతులు, వాళ్లు ఎంతమంది ఉన్నరు, ఏ జాతులు ఉన్నయని ఈ కేంద్రానికి ఎట్ల తెలుస్తదని నేను అడుగుతున్న. ఈ దేశంలో ఎవరు చేయనటువంటిది ముఖ్యమంత్రి కేసీఆర్... రాష్ట్రం ఏర్పడిన కొద్దిరోజుల్లోనే సమగ్ర కుటుంబ సర్వే చేసి వారి స్థితిగతులను కనుగొని దానికి అనుగూణంగా ఇవాళ ఎన్ని సంక్షేమ పథకాలు వస్తున్నాయో మీరందరు చూస్తున్నరు. చాలా రాష్ట్రాలు కూడా సమగ్ర సర్వే చేసి ఆయా రాష్ట్రాల అభివృద్ధి గురించి ఆలోచిస్తున్నారు. రిజర్వేషన్లు పెంచుకునే అవకాశం రాష్ట్రాలకు ఇస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. బీసీ జనగణన చేసుకునే అవకాశం రాష్ట్రాలకు ఎందుకు ఇవ్వడం లేదు. బీసీ ప్రధానిగా ఉన్న వ్యక్తి ఇవాళ ఎందుకు జనగణన చేపట్టడం లేదో ప్రడలకు చెప్పాల్సిన అవసరం ఉంది.
-- శ్రీనివాస్ గౌడ్, మంత్రి
ఇదీ చూడండి: Cm Kcr Speech In Assembly: 'ఊరికొక పంచాయతీ కార్యదర్శి ఏ రాష్ట్రంలోనూ లేరు'