కరోనా మూడో దశలో పిల్లలను కాపాడుకునేందుకు మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ఒక కంచెలా నిలబడాలని ఆ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ పేర్కొన్నారు. బాలింతలు, గర్భిణీలు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలనే అంశంపై నిపుణుల ద్వారా కౌన్సిలింగ్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కరోనా కట్టడికి ఎప్పటికప్పుడు సలహాలు ఇస్తూ.. తగిన చర్యలు చేపడుతూ సంసిద్ధంగా ఉండాలని సూచించారు. కరోనా మూడో దశ 'పిల్లలపై ప్రభావం-కట్టడికి సంసిద్ధత' అనే అంశంపై అన్ని జిల్లాల అధికారులు, వైద్యారోగ్యశాఖ అధికారులు, నిపుణులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
కరోనా సమయంలో ఇంటింటికీ తిరిగి ప్రజలకు ప్రభుత్వంపై నమ్మకం కలిగిస్తున్న అంగన్‌వాడీలకు ఈ సందర్భంగా మంత్రి అభినందనలు తెలిపారు. గర్భిణీ, బాలింతలు ఒకవేళ కొవిడ్ బారిన పడినా.. బయటపడేలా సాయం అందించాలన్నారు. సీఎం కేసీఆర్ మన మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని అధికారులకు సూచించారు. క్షేత్రస్థాయిలో పనిచేసే క్రమంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా పరిష్కరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని మంత్రి స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: Covid: కరోనాకు బలవుతున్న తల్లిదండ్రులు.. అనాథలుగా మారుతున్న పిల్లలు