ప్రైవేటు ఉపాధ్యాయులు, సిబ్బందికి ఏప్రిల్ నుంచే సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రూ.2వేల ఆర్థికసాయం, 25కేజీల సన్నబియ్యం అందించనున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో అన్ని జిల్లాల కలెక్టర్లు, విద్య, పౌరసరఫరాల అధికారులతో బీఆర్కే భవన్ నుంచి మంత్రులు దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు.
లబ్ధిదారులను గుర్తించాలి
ప్రైవేటు పాఠశాలల్లో సుమారు లక్షా 45 వేల మంది పనిచేస్తున్నారని... వీరికి సాయం అందించడానికి నెలకు రూ.42కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. నగదు సాయం కోసం రూ.29 కోట్లు, బియ్యం కోసం రూ.13 కోట్ల 57 లక్షలు అవసరమవుతాయని భావిస్తున్నారు. రేషన్ దుకాణాల వారీగా లబ్ధిదారులను గుర్తించాలని మంత్రుల సమీక్షలో నిర్ణయించారు. ఇందుకోసం కార్యాచరణ సిద్ధం చేయాలని కలెక్టర్లు, అధికారులను మంత్రులు ఆదేశించారు.
అందరినీ ఆదుకుంటాం
ప్రతి ఒక్క ప్రైవేట్ టీచర్, సిబ్బందిని ఆదుకుంటామని మంత్రి సబితా స్పష్టం చేశారు. ఈనెల 20 నుంచి 24 మధ్య వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలిపారు. ఏప్రిల్ నుంచి విద్యాలయాలు ప్రారంభమయ్యే వరకు సాయం అందజేస్తామని ప్రకటించారు. పౌరసరఫరాల శాఖతో సమన్వయం చేసుకుంటూ లబ్ధిదారులకు సాయం అందేలా చూడాలని కలెక్టర్లను ఆదేశించారు.
బియ్యం నిల్వలను వాడుకోవాలి
రాష్ట్రంలోని 33 జిల్లాల్లోని లబ్ధిదారులని రేషన్ షాపుల వారీగా గుర్తించి అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని మంత్రి గంగుల ఆదేశించారు. దాదాపు 13 కోట్ల 57 లక్షల విలువగల 3,625 మెట్రిక్ టన్నుల సన్న బియ్యాన్ని సిద్ధం చేసినట్లు తెలిపారు. ఇప్పటికే ఆయా మండల కేంద్రాల్లో సిద్ధంగా ఉన్న బియ్యం నిల్వలను పంపిణీకి వాడుకోవాలని కలెక్టర్లకు సూచించారు. సహృదయంతో ఆర్థికసాయం, బియ్యం ఇస్తున్నందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.
ఇదీ చదవండి: సంక్షేమ పథకాల్లో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్: ఇంద్రకరణ్