అంతర్‌రాష్ట్ర సర్వీసులను నడిపేందుకు ఉన్న పరిస్థితులు ఏమిటి? ఎప్పటి నుంచి నడపవచ్చు? ప్రస్తుతం బస్సుల్లో ఆక్యుపెన్సీ ఎలా ఉంది? వచ్చే వారం నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షలకు ప్రత్యేక బస్సులను నడపాలా? వద్దా? నడిపితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?.. తదితర అంశాలపై తెలంగాణ ఆర్టీసీ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. అంతర్ రాష్ట్ర రాకపోకలకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అనుమతి ఇచ్చింది. ఆర్టీసీ బస్సుల విషయంలో మాత్రం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. సంబంధిత అంశాలపై మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ బుధవారం సాయంత్రం అధికారులతో సమీక్షించారు.
హైదరాబాద్ మినహా ఇతర ప్రాంతాలకు బస్సులు నడుపుతున్నా ఆక్యుపెన్సీ 45 శాతానికి కూడా చేరటం లేదని ఈ సందర్భంగా అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు. ముఖ్యమంత్రి అనుమతించాకే బస్సులు నడుపుదామని ఆయన వారికి స్పష్టం చేశారు. ఏటా పదో తరగతి విద్యార్థుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. అదే విషయమై ఈసారీ విద్యాశాఖ ఆర్టీసీ అధికారులకు లేఖ రాసింది. ఈ క్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు లేఖ రాయాల్సిందిగా ఆ శాఖకు సూచించాలని సమీక్షలో నిర్ణయించారు. మరోవంక.. ఉద్యోగ భద్రత విషయంలో రెండు మూడు అవకాశాలు ఇచ్చాకే కఠిన చర్యలు తీసుకునేలా నిబంధనలు సరళతరం చేయాలని మంత్రి అధికారులకు స్పష్టం చేశారు. చిన్న తప్పిదాలకే ఉద్యోగం నుంచి తొలగించే విధానానికి స్వస్తి పలకాలని, సమ్మె విరమణ తరవాత ఉద్యోగులతో నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించటం తెలిసిందే. సమీక్షా సమావేశంలో ఆర్టీసీ ఇన్‌ఛార్జి మేనేజింగ్ డైరెక్టర్ సునీల్‌శర్మ, ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు యాదగిరి, పురుషోత్తం నాయక్, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులను మానసికంగా సిద్ధం చేయాలి: మంత్రి కొప్పుల
ఎస్సీ వసతి గృహాల్లో ఉంటూ పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల్లో భయాన్ని పోగొట్టి మానసికంగా సిద్ధం చేయాలని అధికారులను మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదేశించారు. సంబంధిత విద్యార్థుల ఆరోగ్యంపై దృష్టిపెట్టి వారందరికీ పౌష్టికాహారాన్ని అందించాలని పేర్కొన్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో హాస్టల్ గదుల్లో విద్యార్థులు భౌతిక దూరం పాటించేలా చూడటంతో పాటు వారికి మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేయాలని ఆయన సూచించారు.
ఇదీ చూడండి: ముఖ్యమంత్రి కేసీఆర్ కాన్వాయ్కి ఓవర్ స్పీడ్ చలానాలు