రాష్ట్రంలో పండ్లు, కూరగాయల మార్కెట్ల వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి కోసం చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్ మంత్రుల నివాస సముదాయంలోని ఆయన నివాసంలో జరిగిన టీఎస్ ఆగ్రోస్ సంస్థ మండలి సమావేశానికి మంత్రి హాజరయ్యారు. తెలంగాణ సిరి ఎరువుల మార్కెటింగ్, రైతు బజార్లు, ఏఎంసీ వ్యర్థాలతో విద్యుత్ తయారీ అంశాలపై విస్తృతంగా చర్చించారు. మహీంద్రా కంపెనీ సహకారంతో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను సందర్శించి అధ్యయనం చేస్తామని మంత్రి ప్రకటించారు.
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్, ఏపీలో తిరుపతి, ఆధోని, పిడుగురాళ్లలో ఉన్నయూనిట్లను కమిటీ సందర్శించి రూపొందించిన నివేదిక అనంతరం... ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ఆధునిక వ్యవసాయం వైపు రైతులకు ప్రోత్సాహం ఇవ్వడంతో పాటు కూరగాయల సాగుకు చేయూత ఇవ్వనున్నామని స్పష్టం చేశారు. రైతే రాజు కావాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్దేశమని పునరుద్ఘాటించారు. సంప్రదాయ వ్యవసాయంతో రైతులు నష్టపోతున్నందున వ్యవసాయ శాఖ నుంచి సాంకేతిక సలహాలందించనున్నామని వివరించారు.
వ్యవసాయం, అనుబంధ రంగాలకు ప్రోత్సాహం ఇస్తున్న తరుణంలో రైతువేదికలు ఏర్పాటు చేసి అన్నదాతల అభ్యున్నతికి పాటు పడాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. రైతులు ఆర్థికంగా నిలబడేలా తీర్చిదిద్దుతున్నామని నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్ధన్‌రెడ్డి, ఆగ్రోస్ ఎండీ రాములు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: కిడ్నాప్ కేసులో ట్విస్ట్: ఏ-1 ఎ.వి.సుబ్బారెడ్డి, ఏ-2గా అఖిలప్రియ