Minister Niranjan Review on Kharif Fertilizers: రష్యా- ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ముడి సరుకుల కొరత సాకుగా చూపి కేంద్రం.. రాష్ట్రాలకు ఎరువుల సరఫరా జాప్యం చేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆరోపించారు. కేంద్రానికి ఇది సముచితం కాదని ఆక్షేపించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో వానాకాలం ఎరువుల సరఫరాపై ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఖరీఫ్ సీజన్ సంబంధించి రసాయన ఎరువుల ముందస్తు నిల్వలు, కేటాయింపులు, గ్రామాలకు చేరవేత వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.
అప్పటిలోగా సిద్ధం చేయాలి: రాబోయే వానాకాలానికి 24.45 లక్షల మెట్రిక్ టన్నుల మేర కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ కేటాయించిందని మంత్రి అన్నారు. వీటిలో 10.5 లక్షల మెట్రిక్ టన్నులు యూరియా, 9.4 లక్షల మెట్రిక్ టన్నులు కాంప్లెక్సు ఎరువులు, 2.3 లక్షల మెట్రిక్ టన్నులు డీఎపీ, 2.25 లక్షల మెట్రిక్ టన్నులు ఎంఓపీ, ఎస్ఎస్‌పీ చొప్పున సరఫరా చేసేందుకు ఆమోదించిందని చెప్పారు. మే నెలాఖరు నాటికి 5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను సిద్ధంగా ఉంచాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రానికి అవసరమైన డీఏపీ, కాంప్లెక్సు ఎరువులు జూన్ 15 నాటికి సిద్ధం చేయాలని స్పష్టం చేశారు.
సేంద్రీయ ఎరువులు వాడాలి: రాష్ట్రానికి రావాల్సిన ఎరువుల కోసం కేంద్ర ఎరువులు, రసాయన శాఖకు లేఖ రాశామని మంత్రి తెలిపారు. వివిధ నౌకాశ్రయాల్లో అందుబాటులో ఉన్న డీఎపీ, కాంప్లెక్సు ఎరువులు తెలంగాణకు పంపించాలని ఆ లేఖలో విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. రైతులు మూస పద్ధతిలో కాకుండా అధికారుల సూచనల మేరకు ఎరువులు వినియోగించాలని సూచించారు. ఇప్పట్నుంచే భూసార పరీక్షలు నిర్వహించుకుని.. ప్రభుత్వం అందించే పచ్చిరొట్ట ఎరువులు వినియోగించాలని చెప్పారు. సేంద్రీయ ఎరువులు విరివిగా వాడాలని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో వ్యవసాయ శాఖ అధికారులు.. రైతులకు అవగాహన కల్పించాలని మంత్రి నిరంజన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, ఎరువుల విభాగం ఉన్నతాధికారి కె.రాములు, ఎరువుల కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి: Harish Rao On Jobs: 'మేం భర్తీ చేస్తున్నాం... మీరెప్పుడు భర్తీ చేస్తారు?'
'ఆకలి తీరదు.. నిద్ర పట్టదు.. స్నానమూ కష్టమే!'.. చైనా క్వారంటైన్ కేంద్రాల్లో నరకం!!