వినాయక చవితిని పురస్కరించుకుని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి సికింద్రాబాద్ గణేశ్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆలయ అర్చకులు ఆయనకు సాదరంగా ఆహ్వానం పలికారు. ఆలయంలో ప్రత్యేకంగా పూజలు నిర్వహించి స్వామి వారిని దర్శించుకున్నారు. ఆయనతో పాటు ఆలయ ఈవో అంజనీ దేవి, స్థానిక తెరాస నాయకులు పాల్గొన్నారు.
కరోనా వైరస్ విజృంభణ దృష్ట్యా ప్రత్యేక చర్యలు తీసుకుని నిరాడంబరంగా వేడుకలు జరుపుతున్నట్లు ఈవో అంజనీ దేవి పేర్కొన్నారు. గణపతి నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా స్వామి వారికి ప్రతిరోజు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హారతి కార్యక్రమాలు ఉంటాయన్నారు. ఆలయంలో భక్తులు భౌతిక దూరాన్ని పాటించే విధంగా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. గణనాథున్ని బంగారు తాపడంతో అలంకరించామన్నారు.
వినాయక చవితి పురస్కరించుకుని ఆలయాన్ని అందంగా పూలతో శోభాయమానంగా అలంకరించారు. ఉదయం నుంచి భక్తులు గణపతి దర్శనానికి తరలి వస్తున్నారు.
ఇదీ చదవండి: ఈగ ఫిక్షనల్.. ఎలుక ఒరిజినల్