Ktr zoom call On Raksha Bandhan: రాష్ట్రంలోని ప్రతీ మహిళకు ఉజ్వల భవిష్యత్తును కల్పించే పెద్దన్నగా ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా ఉన్నారని ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఎల్లప్పుడు సోదరికి అండగా నిలిచేందుకు సోదరుడు చేసే ప్రమాణానికి ప్రతికే రక్షాబంధన్ అని తెలిపారు. అందుకే రాఖీ పండుగ నాడు కేసీఆర్ చిత్రపటానికి ఆడబిడ్డలంతా రాఖీకట్టాలని కోరారు. రాఖీ పండుగను పురస్కరించుకుని రాష్ట్రంలోని 33 జిల్లాలకు చెందిన వివిధ ప్రభుత్వ పథకాల మహిళా లబ్ధిదారులతో జూమ్ కాల్ ద్వారా కేటీఆర్ మాట్లాడారు.
తెరాస హయాంలో పెన్షన్ పదిరెట్లు పెరిగిందన్న కేటీఆర్.. 14 లక్షల ఒంటరి, వితంతు మహిళలతో పాటు నాలుగు లక్షల మంది మహిళా బీడీ కార్మికులకు పెన్షన్ ఇస్తున్నామని చెప్పారు. ఆగస్టు 15 నుంచి అర్హులైన మరో 10 లక్షల మందిరి 2,016 రూపాయల ప్రకారం పెన్షన్లు ఇవ్వబోతున్నామని తెలిపారు. మహిళా సంక్షేమంతోనే సమాజ పురోగతి సాధ్యమని నమ్ముతున్న ప్రభుత్వం తమదని కేటీఆర్ పేర్కొన్నారు. అమ్మ ఒడి పథకంలో భాగంగా గర్భిణీ స్త్రీల కోసం ప్రత్యేకంగా 300 అంబులెన్సులు ఏర్పాటుచేసిన ఏకైక ప్రభుత్వం మనదేనన్నారు.
అమ్మఒడి పథకంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 10 లక్షల 85 వేల గర్భిణీలకు ప్రయోజనం కలిగిందని కేటీఆర్ వెల్లడించారు. ఇప్పటివరకు 13 లక్షల 30 వేల మంది బాలింతలకు 2 వేల రూపాయల విలువైన కేసీఆర్ కిట్లు అందజేశామన్నారు. ప్రసవం తరువాత ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా మహిళలు శారీరక శ్రమ చేయకూడదన్న ఉద్దేశ్యంతో ఆడపిల్ల పుడితే రూ.13 వేలు, మగబిడ్డ పుడితే రూ12 వేలు అందిస్తున్నట్లు చెప్పారు.
కేసీఆర్ కిట్స్‌తో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 30 శాతం నుంచి 50 శాతం వరకు డెలివరీలు పెరిగాయన్నారు. మాతాశిశు మరణాల తగ్గింపులో దేశం మొత్తంలో తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని కేంద్ర ప్రభుత్వమే మెచ్చుకుందని వెల్లడించారు. సిజేరియన్లను తగ్గించాలన్న లక్ష్యంతో సాధారణ ప్రసవాలు చేసే వైద్య సిబ్బందికి 3 వేల రూపాయల అదనపు ప్రోత్సాహకం ఇస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని పేర్కొన్నారు.
మన ఆడపడుచుల ఆరోగ్యం, సంక్షేమం కోసమే ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నామని కేటీఆర్ స్పష్టం చేశారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా పేదింటి ఆడబిడ్డల పెళ్లికి కల్యాణ లక్ష్మి-షాదీ ముబారక్ పథకంలో భాగంగా లక్షా నూట పదహారు రూపాయలు చెల్లిస్తున్నామని తెలిపారు. తల్లిదండ్రులకు అమ్మాయి పెళ్లి భారం కాకూడదనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న ఈ పథకంతో 12 లక్షల 87 వేల 588 మంది వధువులకు నగదు సాయం అందించినట్లు కేటీఆర్ వెల్లడించారు.
ఇవీ చదవండి: ప్రగతిభవన్ వద్ద హల్చల్.. దివ్యాంగుడి ఆత్మహత్యాయత్నం.. అడ్డుకున్న పోలీసులు