మున్సిపల్ ఎన్నికల్లో ముందు నుంచి అన్నీ తానై నడిపిస్తున్న తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు నేడు దావోస్ వెళ్లనున్నారు. మరోవైపు ప్రచారం తారాస్థాయికి చేరింది. రేపటితో ప్రచారఘట్టం ముగియనుండగా దావోస్ వెళ్తున్న కేటీఆర్... పోలింగ్ ముగిసిన తర్వాతే తిరుగు పయనం కానున్నారు. కీలక సమయంలో విదేశీ పర్యటనకు వెళ్తున్న కేటీఆర్... అక్కడి నుంచే పార్టీ ఎన్నికల కార్యక్రమాలను పర్యవేక్షించనున్నారు.
ఎప్పటికప్పుడు నివేదికలు చేరివేత:
తొమ్మిది మంది కీలక నేతలతో కూడిన రాష్ట్ర స్థాయి సమన్వయ కమిటీ తెలంగాణ భవన్ నుంచి కార్యక్రమాలను నిర్వహిస్తోంది. జిల్లాల వారీగా వివరాలు సేకరిస్తున్న కమిటీ.. ఎప్పటికప్పుడు కేటీఆర్కు చేరవేయనుంది. నివేదికల ఆధారంగా సమన్వయ కమిటీ సభ్యులు, మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు... అవసరమైతే అభ్యర్థులతో కేటీఆర్ ఫోన్లో మాట్లాడి దిశా నిర్దేశం చేయనున్నారు.
ఏ మాత్రం నిర్లక్ష్యం వద్దు:
రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో విజయం సాధిస్తామన్న ధీమాతో ఉన్నా... ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దంటూ పార్టీ శ్రేణులకు కేటీఆర్ ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. పోలింగ్, మేయర్, ఛైర్మన్ ఎన్నిక పూర్తయ్యే వరకూ అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఇవాళ కూడా కీలక నేతలతో సమీక్షించి.. అనుసరించాల్సిన వ్యూహాలను వివరించనున్నారు.