పారిశ్రామిక రంగంలో ఏడేళ్లుగా దేశంలోనే తెలంగాణ ముందుందని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో సమతుల్యమైన అభివృద్ధి జరుగుతోందని తెలిపారు. రంగారెడ్డి జిల్లా మేకగూడలో పోకర్నా స్టోన్ కంపెనీని మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు టీఎస్-ఐపాస్ ద్వారా సులభంగా అనుమతులు ఇస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. పారిశ్రామిక, ఐటీ రంగాలకు ప్రాధాన్యమిస్తూనే.. సాగునూ అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో కులవృత్తుల కోసం పెద్దఎత్తున కార్యక్రమాలు చేపట్టామని వివరించారు.
గత ఏడు సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం పారిశ్రామికీకరణ బాటలో భారతదేశంలోనే ముందుంది. చాలా వేగంగా ముందుకు దూసుకుపోతుంది. ఇందుకు కారణం.. సమర్థవంతమైన నాయకత్వం, సుస్థిరతతో కూడిన ప్రభుత్వం. ఈ రెండూ ఉన్నప్పుడు అభివృద్ధి సాధ్యమవుతుంది. తెలంగాణలో ఓవైపు ఐటీ రంగానికి ప్రాధాన్యం ఇస్తూనే.. ఉపాధి అవకాశాలు కల్పిస్తూనే.. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం, కులవృత్తులు అంతే దీటుగా, అంతే సంకల్పంతో ముందుకు సాగుతున్నాయి. కలిసికట్టుగా ముందుకు నడిచినప్పుడు సమతుల్యమైన అభివృద్ధి సాధించేందుకు అవకాశం ఉంటుంది.-కేటీఆర్, పురపాలక, ఐటీ శాఖ మంత్రి
రూ.500 కోట్ల రూపాయల పెట్టుబడితో 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ కంపెనీ ద్వారా ప్రీమియం ఇంజినీర్డ్ స్టోన్, క్వార్ట్ ఉపరితలాలను తయారు చేసి.. ఇక్కడి నుంచి ఎగుమతి చేయనున్నారు. ఈ ప్లాంటు ఏర్పాటు ద్వారా ప్రత్యక్షంగా సుమారు 500 మందికి, పరోక్షంగా సుమారు 3 వేల మందికి ఉపాధి లభించనుంది. టెక్స్టైల్ రంగంలోనూ విశేష అనుభవం ఉన్న పోకర్నా గ్రూపు రాష్ట్రంలో ఒక అప్పారెల్ మ్యానుఫ్యాక్షరింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాలని కేటీఆర్ ఈ సందర్భంగా కంపెనీని ఆహ్వానించారు.
ఇదీ చూడండి: Lal Darwaza Bonalu: రేపే లాల్‌దర్వాజా బోనాలు.. ఉత్సవాలకు ముస్తాబైన భాగ్యనగరం