Minister KTR on Dalit Bandhu: దళితబంధు లబ్ధిదారులు వినూత్నంగా ఆలోచిస్తే... సంపద సృష్టి జరుగుతుందని దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలుస్తుందని పురపాలక శాఖ కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ బేగంపేట్‌లో నిర్వహించిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్ అంబేడ్కర్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. అందరూ ట్రాక్టర్లు, హార్వెస్టర్లు కొంటామనడం సరికాదని... అలా చేస్తే ప్రభుత్వ ఉద్దేశం సఫలం కాదన్నారు. డిక్కీ సంస్థ ద్వారా ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల తయారీ చేసేందుకు కృషి చేస్తున్నామని కేటీఆర్ తెలిపారు. దళిత బంధు సఫలమైతే దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. దళిత బంధు నిధులను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సిరిసిల్ల జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా తీసుకోవాలని.. ప్రభుత్వ రాయితీలను అందిపుచ్చుకొని అభివృద్ధి చెందాలని సూచించారు.
దళిత బంధు లబ్ధిదారులందరూ.. ట్రాక్టర్లు, హార్వెస్టర్లు కొంటామనటం సరికాదని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. అందరూ ఒకేబాట పడితే ప్రభుత్వ కార్యక్రమం ఉద్దేశం సఫలం కాదని.. దళితబంధు విఫలమైందనే నింద తెలంగాణకు మంచిదికాదన్నారు. మిషన్ భగీరథకు కేంద్రం ఒక్క రూపాయి ఇవ్వలేదని ఆరోపించిన కేటీఆర్.. ఘర్‌ఘర్ జల్ అని ప్రచారం ఆర్భాటంగా చేసుకున్నారని విమర్శించారు. సమానత్వంతో కూడిన సమాజం దిశగా మన అజెండా లేదని అభిప్రాయపడ్డారు.
"సత్తా ఉన్నప్పుడు పది మందికి అవకాశాలు ఇవ్వగలగాలి. ఇతరులను విమర్శించడమే కొందరు పనిగా పెట్టుకున్నారు. సమాజంలో సానుకూల దృక్పథం వచ్చేలా కథనాలు ప్రచారం చేయాలి. నిరాశ, నిస్పృహల నుంచి యువత బయటపడాలి. ప్రభుత్వం అవకాశాలు ఇచ్చినప్పుడు యువత అందిపుచ్చుకోవాలి. దళితబంధును సమర్థంగా అమలు చేసి ఆదర్శంగా నిలవాలి. పథకాల అమలులో భాగంగా అందరినీ కలుపుకొని వెళ్దాం." -కేటీఆర్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి
అంతకుముందుగా పీవీ మార్గ్‌లో చేపడుతున్న 125 అడుగుల అంబేడ్కర్ కాంస్య విగ్రహ నిర్మాణ పనులను మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో కలిసి కేటీఆర్ పరిశీలించారు. డిసెంబర్ నెలాఖరునాటికి అంబేడ్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని మంత్రి వెల్లడించారు. రూ. 150 కోట్లతో విగ్రహ, ప్రాంగణ నిర్మాణ పనులు అద్భుతంగా, అత్యంత వేగంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. అంబేడ్కర్ విగ్రహ స్థలంలో 11 ఎకరాల ప్రాంగణంలో మ్యూజియం, పార్కును ఏర్పాటు చేస్తున్నట్లు కేటీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలు గర్వించే విధంగా సీఎం కేసీఆర్ సంకల్పం, ఆలోచనలను అమలు చేస్తామన్నారు. తెలంగాణ ఏర్పడిన తరువాత.. పీవీ మార్గ్ ప్రాంతంలో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.
ఇవీ చదవండి: 'కాంగ్రెస్ ఒత్తిడికి తలొగ్గే రాష్ట్రప్రభుత్వం ధాన్యం కొనుగోలు'