కొత్త పురపాలికల్లో ఉన్న ఎల్ఆర్ఎస్ భూ క్రమబద్ధీకరణ అవకాశాన్ని వినియోగించుకునేలా పురపాలక శాఖ ప్రత్యేక మేళాలు నిర్వహించనుంది. మహబూబ్నగర్, గద్వాల, నారాయణపేట జిల్లాల పురపాలికలపై మంత్రి కేటీఆర్ నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
నూతన మున్సిపాలిటీల్లో విలీనమైన గ్రామాల్లో భూ క్రమబద్ధీకరణకు పురపాలక శాఖ ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేసింది. సెప్టెంబర్ వరకు గడువు ఉన్నందున విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని పురపాలక శాఖ అధికారులను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. కొత్త జిల్లాలుగా మారిన నారాయణపేట, గద్వాల జిల్లా కేంద్రాల్లో స్పష్టమైన మార్పు కనిపించేలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని మంత్రి సూచించారు. మూడు జిల్లాల పరిధిలోని అన్ని మున్సిపాలిటీల్లో రోడ్లు, గ్రీనరీ, శ్మశానాల వంటి ప్రాథమిక అంశాలపై పూర్తి శ్రద్ధ వహించాలని స్పష్టం చేశారు.
వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు పారిశుద్ధ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని కమిషనర్లు, ఛైర్మన్లకు సూచించారు. రాష్ట్రంలో రానున్న ఐదేళ్లలో మెజార్టీ జనాభా పట్టణాల్లో ఉండే అవకాశం ఉందని.. పట్టణాల ప్రణాళికాబద్ధ అభివృద్ధికి కృషి చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. పౌర సేవలే కేంద్రంగా తీసుకొచ్చిన పురపాలక చట్టంలోని విధులు, అధికారాలను కచ్చితంగా పాటించేలా అధికారులు పని చేయాలని కేటీఆర్ స్పష్టం చేశారు.
ఇదీచూడండి: విద్యా సంవత్సరం నిర్వహణపై ఉన్నత విద్యామండలి సమావేశం