జీహెచ్ఎంసీలో అధికారులంతా క్షేత్రస్థాయిలో ఉండాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశించారు. హైదరాబాద్‌లో భారీ వర్షాలపై టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్న మంత్రి కేటీఆర్.. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా కలెక్టర్లతో కలిసి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి తలసాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, పురపాలక శాఖ విభాగాల అధిపతులు హాజరయ్యారు.
జీహెచ్‌ఎంసీ మేయర్, ఎమ్మెల్యేలు అందరూ క్షేత్రస్థాయిలో పరిస్థితిని పర్యవేక్షించాలన్నారు కేటీఆర్. వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను ఫంక్షన్‌హాళ్లు, కమ్యూనిటీ హాళ్లకు తరలించాలని సూచించారు. వరద బాధితులకు ఆహారం, అవసరమైన దుప్పట్లు వైద్య సదుపాయం కల్పించాలన్నారు. విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టాలని ఆ శాఖ అధికారులను ఆదేశించారు.
హిమాయత్‌సాగర్, హుస్సేన్‌సాగర్ నీరు విడుదల కారణంగా అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. మూసీ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు జాగ్రత్తగా ఉండాలని.. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. రహదారులపై నిలిచిన నీటిని తొలగించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మ్యాన్‌హోళ్లు ఉన్న ప్రాంతాలతో పాటు.. ఓపెన్ నాలాల వద్ద ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. వాతావరణ శాఖ, సహాయక బృందాలను సమన్వయం చేసుకోవాలని మంత్రి కేటీఆర్ తెలిపారు.
ఇదీ చదవండి: హైదరాబాద్‌లో నిలిచిన విద్యుత్, టెలిఫోన్, ఇంటర్నెట్ సేవలు