నూతన సాంకేతిక పరిజ్ఞానంతో సమాజం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లకు పరిష్కారం దొరుకుతుందని పరిశ్రమల శాఖమంత్రి కేటీఆర్ అన్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించిన ఒక సదస్సులో మంత్రి పాల్గొన్నారు. 'భారత్‌లో ఎమర్జింగ్ టెక్నాలజీలకు ప్రోత్సాహం' అనే అంశం పై జరిగిన వర్చువల్ సమావేశంలో మంత్రి కేటీఆర్ పలు అంశాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. వ్యవసాయం, వైద్యం, విద్య వంటి రంగాల్లో ఇన్నోవేషన్, ఎమర్జింగ్ టెక్నాలజీల వల్ల విప్లవాత్మకమైన మార్పులు వస్తాయని మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు.
ఆధునిక ఎమర్జింగ్ టెక్నాలజీలు సాధారణ ప్రజలకు అందుబాటులోకి రావాలంటే దేశంలో డిజిటల్ ఇన్ఫ్రా నిర్మాణం భారీ ఎత్తున చేపట్టాల్సిన అవసరం ఉందని, ఈ రంగంలోనూ రాష్ట్ర ప్రభుత్వం ముందువరుసలో ఉందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రతి ఇంటిని ఇంటర్నెట్తో అనుసంధానం చేసేందుకు అవసరమైన తెలంగాణ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు కార్యక్రమాన్ని త్వరలోనే పూర్తి చేయబోతున్నట్లు వివరించారు. ఎడ్యుటెక్, మెడ్ టెక్, అగ్రి టెక్ వంటి రంగాల్లో అవసరమైన ఇన్నోవేషన్‌ని ప్రోత్సహించాలని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి: నాబార్డు ఫోకస్ పేపర్‌ను విడుదల చేసిన మంత్రి హరీశ్‌రావు