Minister KTR on Telangana Development : తలసరి ఆదాయంలో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ (KTR) తెలిపారు. హైదరాబాద్‌లోని తాజ్ డెక్కన్‌లో తెలంగాణ ఫెడరేషన్ సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన రాష్ట్రానికి పెద్దఎత్తున పెట్టుబడులు వస్తున్నాయన్నారు. పెట్టుబడులు వస్తేనే నగరంలో సంపద పెరుగుతుందని పేర్కొన్నారు. ఈ పదేళ్లలో తెలంగాణ ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయని తెలిపారు.
'ప్రాధాన్యతా క్రమంలో సమస్యలన్నీ పరిష్కరిస్తున్నాం. కొత్త రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించాం. తాగు, సాగునీరు, విద్యుత్ సమస్యలు పరిష్కరించుకున్నాం. ఓఆర్‌ఆర్, ఆర్‌ఆర్‌ఆర్ మధ్య సరికొత్త హైదరాబాద్ తయారవుతుంది. హైదరాబాద్‌కు రాకపోకలు చాలా సులువుగా జరగాలి' అని కేటీఆర్ అన్నారు.
రాష్ట్రంలో రసవత్తరంగా సాగుతోన్న ఎన్నికల ప్రచారాలు - రంగంలోకి దిగుతున్న స్టార్ క్యాంపెయినర్లు
"ఆరేళ్లు మేము నికరంగా పని చేస్తే మాకన్నా ముందు 65 ఏళ్లు కాంగ్రెస్ వాళ్లు పాలించారు. మేము పని చేసినట్టు వాళ్లు పని చేసి ఉంటే ఈరోజు రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఉండేవా..? కాంగ్రెస్ పార్టీ వాళ్లు మూసీని సుందరీకరిస్తామని చెప్తున్నారు. మూసీని నాశనం చేసింది ఎవరు? 65 ఏళ్లలో 55 ఏళ్లు పాలించింది వారే కదా. 55 ఏళ్లు నాశనం చేసిన వారు వచ్చి.. ఇప్పుడు ఆరున్నర ఏళ్లు పాలించిన వాడిని పట్టుకుని నేను నీకు చందమామను అప్పజెప్పిపోయాను.. నువ్వు దాన్ని మొత్తం నాశనం చేశావు, మసిపూశావు అంటే ఎలా న్యాయం అవుతుంది." - కేటీఆర్, మంత్రి
త్వరలో ప్రతి ఇంటికీ ప్రతిరోజు తాగునీరు ఇచ్చేలా ప్రయత్నం చేస్తామని తెలిపారు. భవిష్యత్తులో 24 గంటలు తాగునీరు ప్రతి ఇంటికి వచ్చేలా చేస్తామన్నారు. రెండు సంవత్సరాలు కరోనా ఉన్నా.. తెలంగాణలో మాత్రం ఐటీ రంగంలో విశేష వృద్ధి సాధించామని పేర్కొన్నారు. ఐటీ ఉద్యోగాల కల్పనలో రెండేళ్లుగా బెంగళూరును అధిగమించామని తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి.. ప్రగతి ఇలానే కొనసాగలని మంత్రి కేటీఆర్ కోరారు.
Minister KTR Statement on Congress Party : తెలంగాణలో కాంగ్రెస్ (Congress) అధికారంలోకి వస్తే ప్రతి 6 నెలలకు ఒక సీఎం మారడం పక్కా అని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. వారు అధికారంలోకి వస్తే కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీలు అమలవుతాయో లేదో కానీ.. సీఎంలు పక్కా అని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధికి స్టేబుల్ గవర్నమెంట్.. ఏబుల్ లీడర్‌షిప్ అవసరమని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే నిత్యం పదవుల కోసం కొట్లాటలు జరుగుతాయని విమర్శించారు. రాష్ట్రంలో సంపద సృష్టిస్తేనే పేద ప్రజలకు సహాయం చేయగలమని అన్నారు. అది చేయాలంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు బాగుండాలని తెలిపారు.