KTR on Palle and Pattana Pragathi: రాష్ట్రంలోని ప్రతి పట్టణాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు కృషిచేయాలని పురపాలక శాఖా మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. పట్టణప్రగతి లక్ష్యాలను పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తే రాష్ట్రంలోని ప్రతి పట్టణానికి జాతీయస్థాయి గుర్తింపు తప్పకుండా వస్తుందన్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, మేయర్లు, మున్సిపల్ ఛైర్పర్సన్లు, మున్సిపల్ కమిషనర్లతో వర్చువల్ విధానంలో కేటీఆర్ సమావేశమయ్యారు. పట్టణాల అభివృద్ధి, పట్టణప్రగతిపై వారికి దిశానిర్ధేశం చేశారు. స్థానిక సంస్థలను బలోపేతం చేసేందుకు పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టిందన్న మంత్రి... దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి నెలా ఎలాంటి ఆటంకం లేకుండా స్థానిక సంస్థలకు నిరాటంకంగా నిధులు ఇస్తున్నట్లు చెప్పారు.
ఆ దిశగా ముందుకు సాగాలి..
minister ktr: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనల మేరకు ప్రవేశపెట్టిన పట్టణప్రగతి కార్యక్రమ లక్ష్యాలను అందుకునే దిశగా ముందుకు సాగాలని వారికి స్పష్టం చేశారు. పట్టణప్రగతి లక్ష్యాల పూర్తికి ప్రయత్నిస్తే అన్ని పట్టణాలకు జాతీయ గుర్తింపు వస్తుందన్న కేటీఆర్... ఇప్పటికే పట్టణప్రగతి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని, అమలు పరచిన పురపాలికలకు జాతీయ స్థాయిలో అవార్డులు దక్కిన విషయాన్ని ప్రస్తావించారు. పట్టణాల పురోగతి కోసం ప్రత్యేకంగా టీయూఎఫ్ఐడీసీ సంస్థను ఏర్పాటు చేసి పట్టణప్రగతి నిధులకు అదనంగా పెద్దమొత్తంలో నిధులు కేటాయిస్తున్నట్లు చెప్పారు. దీంతో మౌలికవసతుల కల్పన కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని మంత్రి తెలిపారు. స్థానికసంస్థల పరిధిలో ఉన్న పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, విద్యుత్ దీపాల నిర్వహణ, పచ్చదనం నిర్వహణ వంటి కార్యక్రమాలపై ఎక్కువగా దృష్టి సారించాల్సిన బాధ్యతను పురపాలక సంఘాల ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు తీసుకోవాలని ఆదేశించారు.
ఇలాంటి వ్యవస్థ దేశంలో ఎక్కడా లేదు..
ktr about local bodies:పురపాలన అంటేనే పౌరపాలన అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్న కేటీఆర్... ఆ దిశగా పట్టణాల్లోని పౌరులను భాగస్వాములు చేసేలా కలిసి పనిచేయాలని కోరారు. రానున్న ఆర్నెళ్ల లోపు సమీకృత శాఖాహార, మాంసాహార మార్కెట్లను పూర్తి చేయాలని... వాటితో పాటు పెండింగ్ పనుల పూర్తిపై దృష్టి సారించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. స్థానికసంస్థల కోసం ప్రత్యేకంగా ఒక కలెక్టర్ స్థాయి అధికారిని నియమించిన వ్యవస్థ దేశంలో ఎక్కడా లేదని... ఇంతటి నిబద్ధతతో ఉన్న ప్రభుత్వ ఆలోచనలను అర్థం చేసుకుని అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని కోరారు. అదనపు కలెక్టర్లు సాధ్యమైనన్ని ఎక్కువ సార్లు పట్టణాలను ఆకస్మికంగా తనిఖీ చేయాలని ఆదేశించారు. ఇతర పట్టణాలతో పోటీ పడుతూ తమ పట్టణాలను అభివృద్ధి చేసే దిశగా మరింత చురుగ్గా పనిచేయాలని మంత్రి కోరారు.
పనితీరు కనబరిచేందుకు ప్రయత్నించాలి..
పారిశుద్ధ్య నిర్వహణ, నగరంలో పచ్చదనం పెంపు, తక్కువ ఖర్చుతో సుందరంగా తీర్చిదిద్దడం లాంటి కార్యక్రమాల్లో తమదైన పనితీరు కనబరిచేందుకుకు ప్రయత్నించాలని ప్రజాప్రతినిధులు, అధికారులకు మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. పురపాలనలో వినూత్నంగా ముందుకుపోతున్న కరీంనగర్ కార్పొరేషన్, ఇల్లందు పురపాలికలు, ఇతర పట్టణాల అధికారులు, ప్రజాప్రతినిధులను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. పురపాలక సంచాలకుల కార్యాలయంలో ఏర్పాటు చేసిన మున్సిపల్ నాలెడ్జ్ సెంటర్ ఫర్ అర్బన్ ప్లానర్స్ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
ఇదీ చదవండి: