World AI Show in Dubai: రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు మరో అంతర్జాతీయ కార్యక్రమానికి ఆహ్వానం అందింది. కృత్రిమ మేధపై దుబాయ్‌లో జరగనున్న ప్రపంచ స్థాయి ప్రదర్శనకు మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. జూన్ 7, 8 తేదీల్లో దుబాయ్‌లోని జుమేరా ఎమిరేట్స్ టవర్స్‌లో 'వరల్డ్ ఏఐ షో - మెనా 41వ గ్లోబల్ ఎడిషన్' జరగనుంది. ఈ షోకు ముఖ్య అతిథిగా రావాలని నిర్వాహణా సంస్థ ట్రెస్కాన్ కేటీఆర్‌ను ఆహ్వానించింది.
వివిధ దేశాలకు సంబంధించిన ప్రతినిధులు హాజరవుతారు: ప్రభుత్వ ప్రతినిధులతో పాటు ఆరోగ్య, రిటైల్, తయారీ, బ్యాంకింగ్, ఫైనాన్స్, స్థిరాస్థి, రవాణా వంటి అనేక రంగాలకు చెందిన కంపెనీల ప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొంటారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఇప్పటికే విజయవంతమైన అనుభవాలు, వాటి ఫలితాలను సమావేశంలో ప్రదర్శిస్తారు. దుబాయ్‌కి అత్యంత కీలకమైన ఈ రంగాల్లో ఏఐ ద్వారా కలిగే ప్రయోజనాలను ప్రాథమికంగా చర్చించి.. దీంతో పాటు, వివిధ దేశాల నుంచి పాల్గొంటున్న ప్రతినిధులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో తమ అనుభవాలను వివరిస్తారని నిర్వాహకులు తెలిపారు.
కేటీఆర్ లాంటి నాయకులు పాల్గొంటే ఎంతో విలువ పెరుగుతోంది: కార్యక్రమంలో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో అద్భుతమైన ఫలితాలు సాధించిన సంస్థలు, వ్యక్తులకు అవార్డులు ప్రదానం చేయనున్నారు. మంత్రి కేటీఆర్ నేతృత్వంలో ఐటీ, ఐటీ అనుబంధ రంగాల్లో తెలంగాణ అద్భుత పురోగతి సాధించిందని.. అటువంటి నేతలు పాల్గొంటే సమావేశానికి ఎంతో విలువ చేకూరుతుందని ట్రెస్కార్ వ్యవస్థాపకులు ఎండీ మహమ్మద్ సలీం మంత్రికి పంపిన ఆహ్వానంలో పేర్కొన్నారు.
కేటీఆర్ వల్ల స్ఫూర్తి పొందే అవకాశం ఉంటుంది: దుబాయ్‌లో ఉన్న భారతదేశ, ముఖ్యంగా తెలుగు ప్రవాస భారతీయ టెక్నాలజీ రంగ నిపుణులకు కేటీఆర్ హాజరు ఎంతో స్ఫూర్తినిస్తుందని అన్నారు. తెలంగాణ అనుభవాల నుంచి విదేశాలు, ముఖ్యంగా మిడిల్ ఈస్ట్, ఆఫ్రికన్ రీజియన్ వంటి ప్రాంతాల నుంచి వస్తున్న ప్రతినిధులు స్ఫూర్తి పొందేందుకు అవకాశం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.
ఇటీవల వచ్చిన ఆహ్వానాలు: ఇదే మాదిరిగా అమెరికాలో జరిగే నీటి వనరుల సదస్సుకూ హాజరు కావాలని అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజినీర్స్- ఎన్విరాన్మెంట్ల్ అండ్ వాటర్ రిసోర్స్ ఇన్స్టిట్యూట్ ఆహ్వానించింది. ఈ సదస్సు మే 21 నుంచి 25 వరకు హెండర్సన్ నేవడాలో జరగనుంది. దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకానమీ ఫోరం 50వ సదస్సుకు ఆహ్వానం వస్తే.. ఆయన వెళ్లారు. ఇది జనవరి 21 నుంచి 24 వరకు ఈ సదస్సు జరిగింది.
ఇవీ చదవండి: