T-Works Center Started in Hyderabad: దేశంలో తొలిసారి ఏర్పాటు చేసిన టీ-వర్క్స్‌ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, ఫాక్స్ కాన్ సంస్థ ఛైర్మన్ యంగ్ లియూ చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభించారు. వినూత్న ఆవిష్కరణలకు వేదికను ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీ-వర్క్స్‌ను హైదరాబాద్‌లోని రాయదుర్గంలో 18 ఎకరాల విస్తీర్ణంలో 78 వేల చదరపు అడుగులలో సకల సదుపాయాలతో నిర్మించారు. సంకలిత ప్రోటో టైపింగ్, ఎలక్ట్రానిక్స్ వర్క్‌స్టేషన్, ఫినిషింగ్ షాప్, లేజర్ కటింగ్, పీసీబీ ఫాబ్రికేషన్, కుండల తయారీ, ప్రీ-కంప్లైయన్స్, మెటల్ షాప్ వంటి అత్యాధునిక సాంకేతికతలు ఇక్కడ అందుబాటులో ఉంచారు.
శాస్త్ర, సాంకేతిక రంగాల్లో నూతన ఆవిష్కర్తలకు అండగా నిలిచేందుకు దేశంలో తొలిసారి 'టీ-వర్క్స్' కేంద్రం ఏర్పాటు చేశారు. రానున్న రోజుల్లో ప్రపంచంలోనే అధునాతనమైన ఉత్పత్తులను టీ-వర్స్క్ వేదికగా రూపొందించనున్నట్లు ఇప్పటికే పలువురు పారిశ్రామిక వేత్తలు ప్రకటించారు. సరికొత్త ఆవిష్కరణలు, కొత్త కొత్త ఆలోచనలకు కార్యరూపం ఇవ్వడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా టీ-వర్స్క్‌ను చేపట్టింది.
గ్రామీణ ప్రాంత ఔత్సాహిక యువతకు ఎంతో ఉపయోగం..: ఈ సందర్భంగా సాఫ్ట్‌వేర్ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ఇప్పటికే టీ-హబ్ ఉండగా.. హార్డ్‌వేర్‌కు సంబంధించి టీ-వర్స్క్ పని చేస్తుందని సీఈవో సుజయ్ కారంపురి తెలిపారు. గ్రామీణ ప్రాంత ఔత్సాహిక యువతకు టీ-వర్క్స్ ఎంతగానో ఉపయోగపడుతుందని మంత్రి కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం టీ-వర్క్స్‌లో సుమారు రూ.100 కోట్ల పెట్టుబడి పెట్టినట్లు మంత్రి కేటీఆర్ వివరించారు.
''కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం సహకరించకున్నా రాష్ట్రంలోని యువతకు ఉపాధి కల్పించేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నాం. యువతలోని నైపుణ్యాలను వెలికి తీసేందుకు ఇప్పటికే టీహబ్, వీహబ్ వంటివి ఏర్పాటు చేసుకున్నాం. నేడు కొత్తగా టీ వర్క్స్‌ను ప్రారంభించుకున్నాం. టీ-హబ్ మాదిరిగానే నేడు ప్రారంభమైన టీ-వర్క్స్ సైతం తప్పక విజయవంతం అవుతుందని నమ్ముతున్నా. గ్రామీణ ప్రాంత ఔత్సాహిక యువతకు ఈ టీ-వర్క్స్ ఎంతగానో ఉపయోగపడుతుందని విశ్వసిస్తున్నా.'' -కేటీఆర్, మంత్రి
గతేడాదే సాఫ్ట్ లాంఛ్..: రాష్ట్రంలో టీ-వర్క్స్ నేడు ప్రారంభం అయినప్పటికీ.. గతేడాదే దీనిని సాఫ్ట్ లాంఛ్ చేశారు. ఈ కేంద్రంలోని ఆవిష్కరణలు ఇప్పటికే అందరినీ ఆకట్టుకున్నాయి. ఇందులో భాగంగా రైతులకు ఉపయోగపడేలా నూతన పరికరాన్ని ఆవిష్కరించి గొర్రె అశోక్ అనే ఆవిష్కర్త మంత్రి కేటీఆర్ ప్రశంసలు అందుకున్నారు.
ఇవీ చూడండి..
రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి.. లక్ష మందికి ఉపాధి..
'నన్ను బెదిరించొద్దు.. కోర్టు నుంచి వెళ్లిపోండి!'.. సీనియర్ లాయర్‌పై చీఫ్ జస్టిస్ ఫైర్