రాష్ట్రంలో మైనారిటీల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ అంకితభావంతో కృషి చేస్తున్నారని రాష్ట్రమంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో డ్రైవర్ కమ్ ఓనర్ స్కీం కింద 106 మందికి మారుతి కార్లను అందజేశారు. హైదరాబాద్‌లోని నాంపల్లి హజ్ భవన్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో హోంశాఖ మంత్రి మహమూద్ అలీ పాల్గొన్నారు.
రాష్ట్రంలో అన్ని వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తోందన్నారు. మైనారిటీల అభ్యున్నతికి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తున్నామని చెప్పారు. డ్రైవర్ కమ్ ఓనర్ పథకం వినూత్నమైందని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. మన పథకాలు దేశంలో మరెక్కడా కూడా అమలు కావడం లేదన్నారు.
డ్రైవర్ నుంచి ఓనర్‌గా ఎదగాలి
నిరుద్యోగ యువత డ్రైవర్ స్థాయి నుంచి ఓనర్‌గా ఎదగాలని మంత్రి వారికి సూచించారు. యువత ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు, వారి కుటుంబ జీవన పరిస్థితులు మెరుగయ్యేందుకు ఈ పథకం దోహదపడుతుందని మంత్రి పేర్కొన్నారు. లబ్ధిదారులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు. మైనారిటీలను ఉన్నత విద్యావంతుల్ని చేసేందుకు 204 రాష్ట్రంలో 204 గురుకులాలను ఏర్పాటు చేశామని కొప్పుల వివరించారు.
మైనార్టీలకు సంపూర్ణ సహకారం: మహమూద్ అలీ
పది వేల మంది ఇమామ్, మౌజమ్‌లకు ప్రతి నెల 5 వేల రూపాయల గౌరవ వేతనం అందిస్తున్నట్లు రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ తెలిపారు. మైనార్టీలందరూ సీఎం కేసీఆర్‌కు సంపూర్ణ మద్దతునిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు ఎ.కె.ఖాన్, ప్రభుత్వ కార్యదర్శి అహ్మద్ నదీమ్, ఎమ్మెల్సీ హసన్ ఎఫెండి, ఎమ్మెల్యే హుస్సేన్ మీరజ్, వక్ఫ్ బోర్డు ఛైర్మన్ మహ్మద్ సలీంతో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చాలా గొప్పవి. అన్నివర్గాల అభివృద్ధి కోసం పనిచేస్తున్న ప్రభుత్వం మనది. మైనార్టీలు, ఇతరవర్గాల ప్రజల కోసం కృషి చేస్తున్నాం. అందరినీ అర్థికంగా బలోపేతం చేయాలన్నదే మా లక్ష్యం. అందరి జీవితాల్లో వెలుగు నింపాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని తీసుకొచ్చాం. దేశంలో మరెక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. డ్రైవర్ కమ్ ఓనర్ పథకంలో మీ జీవితాల్లో వెలుగులు నింపాలి. ఇది ప్రభుత్వం అందిస్తున్న సహకారం. ప్రభుత్వ సహకారంతో మరింత మెరుగ్గా జీవనాన్ని కొనసాగించండి. మీరంతా డ్రైవర్లు కాదు అనే ఓనర్లు అన్న భావనతో పనిచేయండి. ఈ పథకాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నా.- కొప్పుుల ఈశ్వర్, మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి