హైదరాబాద్‌ను వర్షాలు ముంచెత్తుతున్న పరిస్థితుల్లో ఎవరూ ఇళ్లను వదిలి బయటకు రావొద్దని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. వర్షాలు భారీగా పడుతుండటం వల్ల చాలా కాలనీలు, బస్తీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయని.. అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ముంపు ప్రాంతాల వారిని శిబిరాలకు తరలించి.. ఆహారం, ఔషధాలు అందించాలన్నారు.
ఏర్పాట్లు చేశాం
గత రెండు రోజులుగా తెలంగాణ, ఏపీలో వర్షాలు భారీగా కురుస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో 30 సెంటి మీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ నేపథ్యంలో వచ్చిన వరదల కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర అధికారులతో కూడా వర్షాల ప్రభావంపై చర్చించామన్నారు. నష్ట నివారణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామని పేర్కొన్నారు. రెండు ఎన్.డి.ఆర్.ఎఫ్ బృందాలను రాష్టానికి పంపించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. అనేక మంది వరదల్లో కొట్టుకుపోయారని వివరించారు.
డ్రైనేజీ గుంతలు
హైదరాబాద్ నగరంతోపాటుగా రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ తరుణంలో రాష్ట్ర భాజపా అధ్యక్షులు, జిల్లాల అధ్యక్షులతో కలిసి సహాయ సహకారాల్లో పాల్గొంటున్నారని చెప్పారు. సామాన్య ప్రజలకు సహాయం అందించాలని యువతకు సూచించారు. హైదరాబాద్‌లో వర్షాల కారణంగా డ్రైనేజీ గుంతలు ఎక్కడ ఉన్నాయో కూడా కనిపించని పరిస్థితి ఏర్పడిందన్నారు. నిర్వాసితులకు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి ఆదుకోవాలని తెలిపారు. రాష్టంలో ఉన్న కేంద్ర బృందాల సేవలను వినియోగించుకోవాలని అధికారులకు తెలిపామని కిషన్‌రెడ్డి వెల్లడించారు.
ఇదీ చూడండి : భారీ వర్షానికి... భాగ్యనగరం అతలాకుతలం