అటవీ సంపదను రక్షించేందుకు అటవీ శాఖ అధికారులు, సిబ్బంది ఎంతగానో కృషి చేస్తున్నారని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి.. అమరులకు ఘనంగా నివాళులర్పించారు. హైదరాబాద్ నెహ్రూ జూ పార్కులోని అటవీ శాఖ అమరుల స్మారక చిహ్నంపై పుష్పగుచ్ఛాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వారి సేవలను గుర్తు చేసుకున్నారు.
వృథాగా పోనివ్వబోం
ఇప్పటి వరకు రాష్ట్రంలో 21 మంది అటవీ శాఖ అధికారులు, సిబ్బంది విధి నిర్వహణలో అమరులు కావడం.. బాధాకరమని ఇంద్రకరణ్ అన్నారు. ప్రకృతి వనరులను పరిరక్షించేందుకు అటవీ శాఖ అధికారులు, సిబ్బంది నిరంతర సేవలందిస్తున్నారని పేర్కొన్నారు. అటవీ సంపద దోపిడీకి పాల్పడుతున్న మాఫియాతో పోరాడిన.. అమరుల త్యాగాలు వృథాగా పోవని స్పష్టం చేశారు. కరోనా క్లిష్ట పరిస్థితుల్లోనూ అటవీ శాఖ సిబ్బంది తమ విధులను నిర్వర్తించారని.. వారి రక్షణకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని చెప్పారు. విధి నిర్వహణలో అమరులైన అటవీ అధికారులు, సిబ్బంది కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
అడవుల సంరక్షణలో భాగంగా ఎంతో మంది ప్రాణత్యాగం చేశారు. వారి సేవలను మరువం. రాజస్థాన్ అడవులను రక్షించడంలో 363 మంది తమ ప్రాణాలను సైతం అర్పించారు. రాష్ట్రంలో 1984 నుంచి ఇప్పటివరకు 21 మంది అటవీ సిబ్బంది దుండగుల చేతిలో వీరమరణం పొందారు. అమూల్యమైన అటవీ సంపదను పరిరక్షించడానికి ప్రజల భాగస్వామ్యంతో ఎన్నో చర్యలు చేపడుతున్నాం. జంగిల్ బచావో- జంగిల్ బడావో నినాదం ద్వారా ఇప్పటికే ఉన్న అడవుల రక్షణ, క్షీణించిన అడవుల పునరుజ్జీవనం కోసం చర్యలు తీసుకుంటున్నాం. సీఎం కేసీఆర్ దిశానిర్దేశంతో అడవుల రక్షణ, స్మగ్లింగ్ కార్యకలాపాలను అరికడతాం. కలప అక్రమ రవాణా అరికట్టడానికి సాయుధ పోలీసు దళాల సహకారం తీసుకుంటాం. సహజ వనరులను కాపాడుకోవడం మనందరి బాధ్యత.
-ఇంద్రకరణ్ రెడ్డి, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి
పీడీ యాక్ట్ నమోదు
అటవీ శాఖను బలోపేతం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉద్యోగులను, సిబ్బంది నియామకాలను చేపట్టిందని మంత్రి అన్నారు. అటవీ పునరుజ్జీవనానికి 2020-21లో 90,52,840 హెక్టార్లలో మొక్కలు పెంచామని చెప్పారు. రాష్ట్రంలో పచ్చదనం పెంచడం కోసం హరితహారం పథకం ద్వారా ఇప్పటివరకు 232 కోట్లకు పైగా మొక్కలు నాటినట్లు ఇంద్రకరణ్ అన్నారు. మొక్కల పెంపకం కోసం గ్రామాల్లో నర్సరీలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అటవీ సంపద దోపిడీకి పాల్పడిన వారిపై పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. నూతన పంచాయతీ, మున్సిపల్ చట్టాల ద్వారా నాటిన మొక్కలను సంరక్షించుకునేందుకు కఠినమైన నిబంధనలు పొందుపరిచినట్లు వివరించారు.
ఈ కార్యక్రమంలో ఎఫ్డీసీ ఛైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఏ శాంతి కుమారి, అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్) ఆర్. శోభ, పీసీసీఎఫ్‌లు దొబ్రియల్, లోకేష్ జైస్వాల్, స్వర్గం శ్రీనివాస్, ఎఫ్డీసీ ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చదవండి: Hyderabad girl rape: సైదాబాద్ బాలిక హత్య.. పోలీసుల అదుపులో నిందితుడు