Harishrao Fires on Governor Tamilisai: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై గవర్నర్ తమిళిసై వ్యాఖ్యలపై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. సచివాలయం ప్రారంభానికి గవర్నర్‌ను పిలవాలని రాజ్యాంగంలో ఉందా అని వ్యాఖ్యానించారు. పార్లమెంట్ శంకుస్థాపనకు, వందేభారత్ రైళ్ల ప్రారంభానికి రాష్ట్రపతిని ప్రధాని పిలిచారా అని ప్రశ్నించారు. గవర్నర్‌గా, మహిళగా తమిళిసైపై గౌరవం ఉందని.. అయితే రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
సుప్రీంకోర్టులో కేసు వేసే దాకా బిల్లులపై గవర్నర్ స్పందించలేదని.. చివరకు కొన్నింటికి కొర్రీలు పెట్టారన్నారు. ముఖ్యమైన బిల్లులు ఆపడం ప్రజలకు విద్య, వైద్యం దూరం చేయడమేనని హరీశ్‌రావు ఆరోపించారు. పిల్లలకు విద్య, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలను గవర్నర్ దూరం చేస్తున్నారు. బీఆర్ఎస్ శాసనసభ పక్షం కార్యాలయంలో హరీశ్‌రావు ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు.
ఎమ్మెల్యే పొదెం వీరయ్య వినతి పత్రం ఇచ్చారని భద్రాచలం విలీన గ్రామాల బిల్లును ఆపడం అన్యాయం కాదా అన్నారు. వైద్య శాఖలో ప్రొఫెసర్ల పదవీ విరమణ వయసు పెంచడానికి సంబంధించిన బిల్లులో రాజ్యంగపరంగా అభ్యంతరాలు ఏమున్నాయని ఆపారని ప్రశ్నించారు. పదవీ విరమణ వయసు 70 ఏళ్లకు పెంచవచ్చునని జాతీయ వైద్య మండలి నిబంధనల్లోనే ఉందని.. అనేక రాష్ట్రాల్లో 65 నుంచి 70 ఏళ్లకు పదవీ విరమణ పెంచారన్నారు.
ప్రజలకు నష్టమే..: వేరే రాష్ట్రాల్లో లేని అభ్యంతరం ఇక్కడ గవర్నర్‌కు ఎందుకని హరీశ్‌రావు అన్నారు. వైద్య, విద్య ప్రొఫెసర్ల పదవీ విరమణ వయస్సు బిల్లును ఏడు నెలలు ఆపడం ప్రజలకు నష్టం కలిగించడం కాదా అని హరీశ్‌రావు ప్రశ్నించారు. బెంగాల్‌లో 70 ఏళ్లు ఉన్నప్పుడు.. ఇక్కడ 65కూ గవర్నర్ ఒప్పుకోరా అన్నారు. వైద్యురాలు అయి ఉండి.. ప్రజలకు వైద్య సదుపాయాలు అందకుండా చేయడం న్యాయమా అని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. పంచాయతీ స్థానిక సంస్థల్లో అవిశ్వాసానికి నాలుగేళ్ల కనిష్ఠ పరిమితిని పెంచితే గవర్నర్‌కు ఇబ్బంది ఏమిటన్నారు.
అభివృద్ధి కోణంలో తీసుకున్న నిర్ణయాన్ని.. గవర్నర్ ఆపొచ్చునా అన్నారు. బిహార్, ఝార్ఖండ్, ఒడిశాల్లో ఎన్నో ఏళ్ల నుంచి విశ్వవిద్యాలయల్లో ఉమ్మడి నియామకాలు జరుగుతున్నాయని.. ఇక్కడ గవర్నర్‌కు దీనిపై ఎందుకు అభ్యంతరమని హరీశ్‌రావు ప్రశ్నించారు. గవర్నర్ తమిళిసై నోటితో నవ్వుతూ.. నొసలితో వెక్కిరించినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
వెన్ను పోటు పొడుస్తున్నారు..: గతంలో ఐదు ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లుకు ఆమోదం తెలిపిన గవర్నర్ ఇప్పుడు మరో ఏడింటికి అనుమతివ్వకపోవడం రాజకీయం కాదా అని మంత్రి వ్యాఖ్యానించారు. బీజేపీ పాలిత మహారాష్ట్ర, కర్ణాటకల్లోనూ పెద్ద సంఖ్యలో ప్రైవేట్ యూనివర్సిటీలు ఉన్నాయి కదా అన్నారు. బిల్లులను అడ్డుకోవడం ద్వారా గవర్నర్ రాష్ట్ర ప్రగతిని అడ్డుకోవడం కాదా అని ప్రశ్నించారు. తన ప్రభుత్వం అంటూనే ప్రభుత్వానికి గవర్నర్ వెన్ను పోటు పొడుస్తున్నారని మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు.
జీ20కి సంబంధించిన సమావేశాల్లో గవర్నర్ తెలంగాణ ఆత్మ గౌరవం దెబ్బ తీసేలా మాట్లాడారని మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై గవర్నర్ మాటలు రాష్ట్ర ప్రతిష్ఠను దెబ్బ తీసేలా ఉన్నాయన్నారు. జీ20కి సంబంధించిన సమావేశంలో హైదరాబాద్ ప్రతిష్ఠ పెంచేలా మాట్లాడాల్సిన గవర్నర్.. రాష్ట్ర ప్రతిష్ఠను తగ్గించేలా వ్యవహరించారన్నారు.
రజనీకాంత్ ప్రశంస..: తమిళనాడుకే చెందిన ప్రముఖ నటుడు రజనీకాంత్.. ఇది హైదరాబాదా.. న్యూయార్కా అన్నారని గుర్తు చేశారు. కేసీఆర్ ఎన్నో సార్లు రాజీనామా చేసి గెలిచారని.. గవర్నర్ ఎప్పుడైనా గెలిచారా అని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఒక్క బటన్ నొక్కి ఎనిమిది వైద్య కాలేజీలు ప్రారంభించారని.. ప్రధాని నరేంద్రమోదీ ఒక ఎయిమ్స్ తెచ్చి భారీ హంగామా చేశారని విమర్శించారు. గవర్నర్ రాజకీయాలు మాట్లాడాలనుకుంటే.. బీజేపీ వేదికగా రావాలని.. తాము స్వాగతిస్తామన్నారు.
ఇవీ చదవండి: