Harish Rao review on medical colleges and hospitals: త్వరలోనే హైదరాబాద్‌లో నలువైపులా ప్రతిపాదించిన సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. దిల్లీ ఎయిమ్స్ తరహాలో ఆ ఆస్పత్రుల్లో సేవలు అందుతాయని మంత్రి అన్నారు. రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న 8 మెడికల్ కాలేజీల నిర్మాణ పనులపై సంబంధిత అధికారులతో హైదరాబాద్‌లో మంత్రి సమీక్ష నిర్వహించారు. కళాశాలల నిర్మాణంలో ఏ మాత్రం రాజీ పడకుండా.. పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.
అత్యాధునిక సదుపాయాలతో
వరంగల్‌లో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి పూర్తైతే రాష్ట్రం మెడికల్ హబ్‌గా మారుతుందని హరీశ్ రావు విశ్వాసం వ్యక్తం చేశారు. అత్యాధునిక వైద్య సదుపాయాలు, సూపర్ స్పెషాలిటీ సేవలతో కూడిన వరంగల్ హెల్త్ సిటీని 215.35 ఎకరాల్లో ప్రభుత్వం నిర్మిస్తోందని తెలిపారు. మొత్తం 2,000 పడకల సామర్థ్యంతో ఈ ఆస్పత్రి నిర్మాణం జరగనునుందని వెల్లడించారు. జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఈఎన్టీ, డెర్మటాలజీ, ఆర్థోపెడిక్స్ వంటి సేవల కోసం 1200 పడకలు.... ఆంకాలజీ, న్యూరాలజీ, న్యూరోసర్జరీ, పీడియాట్రిక్ సర్జరీ, గ్యాస్ట్రోఎంటరాలజీ, కార్డియాలజీ, కార్డియో థొరాసిక్, యూరాలజీ, నెఫ్రాలజీ వంటి సూపర్ స్పెషాలిటీ విభాగాల కోసం మరో 800 పడకలు కేటాయించనున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, డీఎంఈ రమేశ్ రెడ్డి, టీఎస్ఎమ్ఎస్ఐడీసీ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, కాళోజీ వర్శిటీ వీసీ కరుణాకర్ రెడ్డి, ఓఎస్డీ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: 'అంటే.. వాజ్‌పేయి కూడా రాజ్యాంగాన్ని అవమానించినట్టేనా..?'