Harish rao on Budget: సమగ్రమైన ఆర్థిక, సామాజిక అధ్యయనంపై అవగాహన ఉన్నప్పుడే దేశం గానీ, రాష్ట్రం గానీ పురోగతి పథంలో ముందుకు పోతుందని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆర్థిక, సామాజిక ఫలితాల ఆధారంగా మంచి పరిపాలనతో పాటు చక్కటి బడ్జెట్ రూపకల్పనకు సాధ్యమవుతుందన్నారు. హైదరాబాద్ బేగంపేటలోని సామాజిక, ఆర్థిక అధ్యయన కేంద్రం(సెస్)లో విద్యార్థుల కోసం వసతిగృహ నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, సెస్ వ్యవస్థాపక సభ్యులు మహేందర్‌రెడ్డి, జీఆర్‌రెడ్డి, పాపిరెడ్డి, మాజీ మంత్రి జోగిరామయ్య తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర ఆర్థిక, సామాజిక స్థితిగతులపై అధ్యయనాలు చేస్తూ.. సెస్ రాష్ట్ర ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు విలువైన సూచనలు చేస్తుందని మంత్రి తెలిపారు. బడ్జెట్‌కు ముందు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నెల రోజుల ముందు ప్రీబడ్జెట్‌పై చర్చిస్తాయని.. ఆ సమయంలో సెస్ వంటి సంస్థలు సరైనా సూచనలు, సలహాలు ఇస్తే బడ్జెట్‌లో పెట్టేందుకు దోహదం చేస్తాయన్నారు. జాతీయ స్థాయిలో ఇక్కడి పీహెచ్‌డీ కోర్సుకు మంచి డిమాండ్ ఉందన్న ఆయన వివిధ రాష్ట్రాల నుంచి విద్యార్థులు ఇందులో చేరుతున్నారన్నారు. విద్యార్థుల అవసరాల నిమిత్తం 5 కోట్లతో బాలికల వసతి గృహం ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమన్నారు. భవిష్యత్‌లో సెస్‌ను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలైనా చర్యలు తీసుకుంటుందన్నారు. రాబోయే రోజుల్లో బడ్జెట్ అంశాలకు సంబంధించి సెస్‌తో మరింతగా కలిసి పని చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.
బడ్జెట్‌పై విశ్లేషణ జరగాలి..
రాబోయే రోజుల్లో కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టిన వెంటనే విశ్లేషణ జరగాలి. ఆ బడ్జెట్ ఎలా ఉంది, రాష్ట్రాలకు ఎలా ఉపయోగపడుతుంది అనేది తెలియాలి. మన రాష్ట్రానికి నిధులు సమకూర్చుకోవడానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది. రాష్ట్ర ఆర్థిక, సామాజిక అవసరాలకు ఆ బడ్జెట్‌ను ఎంతమేరకు ఉపయోగించుకోవచ్చు. సెస్ ద్వారా బడ్జెట్‌కు ముందు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నెల రోజుల ముందు ప్రీబడ్జెట్‌పై చర్చిస్తాయి. ఆ సమయంలో సెస్ ద్వారా విలువైన సలహాలు, సూచనలు ఇస్తే వాటిని ప్రీబడ్జెట్ సమావేశంలో చర్చిస్తాం. ఆ సమయంలో సెస్ వంటి సంస్థలు సరైనా సూచనలు, సలహాలు ఇస్తే బడ్జెట్‌లో పెట్టేందుకు ఉపయోగకరంగా ఉంటుంది. రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు కూడా ఇలాంటి అంశాలపై చర్చిద్దాం.
-హరీశ్ రావు, రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి
ఇదీ చదవండి: