Ministers Review On power distribution companies: రాష్ట్ర విద్యుత్ పంపిణీ వ్యవస్థలపై పలు ఛార్జీలు, రుసుముల పేరుతో కేంద్రం భారం మోపుతున్నందున విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లకు నష్టాలు పెరిగిపోతున్నాయని మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డిలు స్పష్టం చేశారు. డిస్కంల ఆర్థిక పరిస్థితిపై వరసగా రెండోరోజు వారు ఉన్నతాధికారులతో సుదీర్ఘ సమీక్ష జరిపారు. మంగళవారం జరిగిన సమావేశంలో ఇంధనశాఖ ప్రత్యేక కార్యదర్శి సునీల్ శర్మ, ట్రాన్స్‌కో-జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు, దక్షిణ డిస్కం సీఎండీ రఘుమారెడ్డి, ట్రాన్స్‌కో జేఎండీ శ్రీనివాసరావు పాల్గొన్నారు.
‘‘తెలంగాణ ఏర్పడే నాటికే రూ.12,185 కోట్ల నష్టాలతో డిస్కంలున్నాయి. విద్యుత్ రంగంపై కేంద్రం తీసుకున్న నిర్ణయాలు అదనపు భారంగా పరిణమించాయి. అధికారంలోకి వచ్చిన ఆర్నెల్లలోనే 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా అందించిన రాష్ట్ర సర్కారుపై విద్యుత్ సంస్కరణల పేరుతో మోదీ సర్కారు ఆర్థికభారం మోపుతోంది. గ్రీన్ ఎనర్జీ రుసుం గతంలో టన్ను బొగ్గు వినియోగంపై రూ.50 ఉండగా.. ఒక్కసారిగా 400 రూపాయలకు పెంచడంతో రూ.7,200 కోట్ల అదనపు భారం పడింది. డిస్కంలు థర్మల్ కేంద్రాల నుంచి ఏటా 50 వేల మిలియన్ యూనిట్లను కొంటున్నాయి. కేంద్రం బొగ్గు ధరలను సాలీనా 6 నుంచి 10 శాతానికి పెంచడంతో రూ.725 కోట్లు డిస్కంలపై భారం పడుతోంది. గడిచిన నాలుగేళ్లలో బొగ్గు రవాణాకు రైల్వే ఛార్జీలు 40 శాతం పెంచింది. సీలేరు, కృష్ణపట్నం కేంద్రాల నుంచి తెలంగాణ డిస్కంలకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాల(పీపీఏ)ను ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది. బహిరంగ మార్కెట్‌లో అధిక ధరలకు కరెంటు కొనడంతో సంస్థలపై రూ.2763 కోట్ల అదనపు భారం పడింది. ఏపీలోని విద్యుదుత్పత్తి సంస్థలు కరెంటును ఆపేయడంతో తెలంగాణ సంస్థలు రూ.2502 కోట్లు భరించాల్సి వచ్చింది.
అనేక వర్గాలకు రాయితీపై కరెంటు
సీఎం కేసీఆర్ వీటన్నింటినీ తట్టుకుంటూనే నిరంతర విద్యుత్తు సరఫరా చేస్తున్నారు. ఒక్కో వ్యవసాయ పంపుసెట్‌కు ఏటా రూ.18,167 చొప్పున రాయితీ ఇస్తున్నారు. వ్యవసాయ కనెక్షన్లను ఇవ్వడానికే డిస్కంలు రూ.3,375 కోట్లు ఖర్చు పెట్టాయి. ఎత్తిపోతల పథకాలకు ప్రభుత్వం రూ.3,200 కోట్లు ఖర్చు చేస్తోంది. 200 యూనిట్లలోపు విద్యుత్‌ను వినియోగించే గృహ వినియోగదారులకు రాయితీ రూపంలో ఏటా రూ.1253 కోట్లు చెల్లిస్తోంది. 101 యూనిట్లలోపు విద్యుత్‌ను వినియోగించే 5,77,100 మంది ఎస్సీ, 2,69,983 ఎస్టీల ఇళ్లకు ఉచితంగా కరెంటు ఇస్తోంది. నాయీ బ్రాహ్మణులకు 15,046 క్షౌరశాలలకు, 47545 ఇస్త్రీ దుకాణాలకు, దోబీఘాట్లకు నెలకు 250 యూనిట్ల చొప్పున ఉచిత విద్యుత్‌ను ఇస్తున్నాం. 4920 పవర్‌లూమ్‌లకు, 5920 కోళ్ల ఫారాలకు, 36 స్పిన్నింగ్ మిల్లులకు.. యూనిట్‌కు రూ.2 చొప్పున ప్రభుత్వం రాయితీ ఇస్తోంది. కొవిడ్ ప్రభావంతో రూ.4374 కోట్ల ఆదాయం తగ్గడంతో డిస్కంలపై అదనంగా ఆర్థిక భారం పడింది’’ అని చెప్పారు.
ఇదీ చూడండి: Electricity Charges Increase : ఈసారి కరెంటు ఛార్జీల పెంపు భారీగానే..!