రాష్ట్రానికి అడుగడుగునా ద్రోహం చేస్తున్న భాజపా.. ఏ మొహంతో పట్టభద్రుల ఓట్లు అడుగుతోందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ధ్వజమెత్తారు. గల్లీలో ఓ తీరు.. దిల్లీలో మరోలా వ్యవహరిస్తున్న కమలం పార్టీ ద్వంద్వ వైఖరిని ఎండగట్టాలన్నారు. ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలోని డివిజన్ల ఇంచార్జిలు, కార్యకర్తల సమావేశంలో మంత్రి గంగుల కమలాకర్ పాల్గొన్నారు.
రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే తెరాసను గెలిపించుకోవాలని గంగుల పేర్కొన్నారు. ప్రతి ఒక్క కార్యకర్త యాభై మంది పట్టభద్రులను కలిసి ఓట్లు అడగాలని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస కచ్చితంగా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, ఉమ్మడి హైదరాబాద్ జిల్లా ఇంఛార్జిలు, కార్పొరేటర్లు, ఎమ్మెల్సీలు, కార్యకర్తలు పాల్గొన్నారు.