ప్రైవేటు ఆస్పత్రులకు కరోనా చికిత్స అందించేందుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన తర్వాత ఆయా ఆస్పత్రులు ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. దీనిపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. చివరికి పూర్తి చికిత్స బిల్లులు కడితే కానీ మృత దేహాన్ని ఇవ్వమని కొన్ని ఆస్పత్రులు పీడిస్తున్నాయి. ప్రభుత్వానికి ఇప్పటివరకు ప్రైవేట్ ఆస్పత్రులపై 1039 ఫిర్యాదులు అందాయి. వీటిపై ఆస్పత్రుల వివరణలు పరిశీలించేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని మంత్రి ఈటల అధికారులను ఆదేశించారు.
ప్యాకేజ్ పేరుతో వసూలు
ఇప్పటికే నగరంలోని దాదాపు అన్ని ఆస్పత్రులపై ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. వేరే జబ్బుల కోసం చికిత్స చేయించుకోవడానికి ఆస్పత్రికి వచ్చిన వారిని.. కరోనా నిర్ధరణ పరీక్షల కోసం కరోనా ప్యాకేజ్ పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారంటూ కూడా ఫిర్యాదులు అందాయి. వాస్తవానికి కరోనా నిర్ధరణ కోసం ర్యాపిడ్ పరీక్ష లేదా ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేసుకోవడానికి ప్రైవేట్ ఆస్పత్రులకు అనుమతులు ఉన్నాయి. కానీ అవి పక్కనపెట్టి సిటీ స్కాన్, ఎక్స్రే, రక్త పరీక్షల పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయి. రక్త పరీక్షల్లో కూడా ఎల్డీహెచ్, సీ ఆర్పీ, ఫెరిటిన్, ఐఎల్-6 లాంటి పరీక్షలను అవసరం లేకున్నా చేస్తున్నారంటూ పలువురు ఫిర్యాదు చేశారు.
షోకాజ్ నోటీసులు
ఫిర్యాదులు వచ్చిన ఆస్పత్రులకు ప్రభుత్వం అధికారులు షోకాజ్ నోటీసులు పంపారు. ఆయా ఆసుపత్రులు ఇచ్చిన వివరణలను పరిశీలించడానికి వెంటనే ఒక కమిటీ ఏర్పాటు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ వివరణలపై విచారణ చేసి తప్పులు చేసిన ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. మరో వైపు కేంద్ర బృందంతో జరిగిన సమావేశంలో కూడా ప్రైవేట్ ఆస్పత్రులపై తీసుకుంటున్న చర్యలపై చర్చ జరిగింది.
ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశం
రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కేంద్ర బృందం సమర్థించింది. అవసరమైతే ఏపిడమిక్ డిసీజ్ యాక్ట్ కింద కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర బృందం సూచించిందని మంత్రి ఈటల తెలిపారు. ప్రైవేటు ఆస్పత్రులు తమ తీరు మార్చుకోవాలని మరోమారు మంత్రి ఈటల విజ్ఞప్తి చేశారు. ఇంకా అలాగే కొనసాగితే ప్రతి ప్రైవేట్ ఆస్పత్రిలో ఐసీయూతోపాటు అన్ని బెడ్స్లలో 50% బెడ్లను స్వాధీనం చేసుకుంటామన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కరోనా చికిత్సలు జరపటానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
ఇదీ చూడండి : ఆలోచనకు ఆశయం అద్దారు... జాతీయ పురస్కారం పొందారు