పేదలకు రూపాయి ఖర్చులేకుండా రోగ నిర్ధరణ పరీక్షలు చేయించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. ప్రభుత్వాసుపత్రుల్లో రోగ నిర్ధరణ కేంద్రాల ఏర్పాటుపై సభ్యులడిగిన ప్రశ్నలకు మంత్రి బదులిచ్చారు. హైదరాబాద్‌తోపాటు సిద్దిపేట జిల్లాలో టీఎస్-డయాగ్నస్టిక్స్ సెంటర్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. వీటికితోడు మరో 18 కేంద్రాల ఏర్పాటుకు ఏప్రిల్ నాటికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఈటల సభకు వివరించారు. 60 రకాల పరీక్షలు ఉచితంగా చేస్తున్నామని.. కోటి నుంచి కోటిన్నర రూపాయల పరికరాలు సమకూర్చి జిల్లాల్లోనూ టీఎస్-డయాగ్నస్టిక్స్ అందుబాటులోకి తీసుకువస్తామన్నారు.
కరీంనగర్, కొత్తగూడెం, ఆసిఫాబాద్, ఖమ్మం, సంగారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, వికారాబాద్, మెదక్, జగిత్యాల, జనగాం, గద్వాల, మహబూబాబాద్, ములుగు, సిరిసిల్ల, నల్గొండ జిల్లాల్లో కొత్త కేంద్రాలు ఏర్పాటు చేస్తామని మంత్రి ఈటల వెల్లడించారు.