అన్ని గ్రామీణ మండలాల్లో బృహత్ ప్రకృతి వనాల ఏర్పాటు కోసం 5300 ఎకరాల భూమిని గుర్తించినట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా పచ్చదనాన్ని పెంపొందించే సంకల్పంతో గ్రామీణ ప్రాంతాల్లోని మండలాల్లో బృహత్ ప్రకృతి వనాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు చెప్పారు. 116 కోట్ల వ్యయంతో 19,472 పల్లెప్రకృతి వనాల నిర్మాణాన్ని చేపట్టి 99 శాతానికి పైగా 19,413 పల్లెప్రకృతి వనాలు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చామని ఆయన తెలిపారు. నిర్మాణంలో ఉన్న మిగతా 59 పల్లెప్రకృతి వనాలను పూర్తిచేసేందుకు సంబంధిత అధికారులను ఆదేశించినట్లు మంత్రి చెప్పారు. పల్లెప్రకృతి వనాలకు గ్రామీణ ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని... మండలానికి ఒకటి చొప్పున బృహత్ పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారని ఎర్రబెల్లి తెలిపారు.
మండల కేంద్రంలో లేదా మండలంలోని మేజర్ గ్రామపంచాయతీలో పది ఎకరాల స్థలంలో బృహత్ పల్లెప్రకృతి వనాలు ఏర్పాటు చేస్తామని అన్నారు. ఒక్కో పల్లె ప్రకృతి వనం ఏర్పాటుకు 40 లక్షల రూపాయలు వ్యయం అవుతుందని, ఒక్కో దాంట్లో దాదాపు 31,000 మొక్కలు పెంచనున్నట్లు దయాకర్ రావు తెలిపారు. బృహత్ ప్రకృతివనాల కోసం ఇప్పటివరకు 535 మండలాల్లో పది ఎకరాల చొప్పున 5,300 ఎకరాల భూమిని గుర్తించామని... మిగతా పది మండలాల్లో భూమి ఎంపిక ప్రక్రియ వెంటనే పూర్తవుతుందని చెప్పారు. త్వరలోనే సంబంధిత పనులు ప్రారంభం అవుతాయని ఆయన తెలిపారు.
ఇదీ చదవండి: NEW PLANT: అనంతగిరి కొండల్లో కొత్త జాతి మొక్కను గుర్తించిన శాస్త్రవేత్తలు