ETV Bharat / state

ఉన్నదంతా ఊడ్చి ఊరికి

వలస కూలీల కన్నీటి కష్టాలు ఆగడం లేదు. తమ స్వస్థలాలకు వెళ్లేందుకు వారు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కాదు. తమ వద్ద ఉన్నవన్నీ ఊడ్చి ఊళ్లకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. కొందరు డబ్బు సమకూర్చుకునేందుకు కూలి పనులకు వెళుతున్నారు. మరికొందరు స్వగ్రామం నుంచి సొమ్ములు రప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

migrant workers are facing problems in returning home
ఉన్నదంతా ఊడ్చి ఊరికి
author img

By

Published : May 16, 2020, 5:27 AM IST

వలస కూలీల కన్నీటి కష్టాలు ఆగడం లేదు. తమ స్వస్థలాలకు వెళ్లేందుకు వారు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కాదు. తమ వద్ద ఉన్నవన్నీ ఊడ్చి ఊళ్లకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. కొందరు డబ్బు సమకూర్చుకునేందుకు కూలి పనులకు వెళుతున్నారు. మరికొందరు స్వగ్రామం నుంచి సొమ్ములు రప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకొందరు బియ్యం, ఇతర సాయం బదులు డబ్బులిస్తే ఊరెళ్లడానికి పనికొస్తాయంటూ దాతల్ని బతిమాలుకుంటున్నారు.

శ్రామిక్‌ రైళ్లలో వెళ్లేందుకు దరఖాస్తులు చేసుకున్న వారికి పిలుపు ఎప్పుడొస్తుందో తెలియని పరిస్థితి. ఏసీ ప్రత్యేక రైళ్లు ప్రకటించినా అవి దిల్లీ, బెంగళూరు వైపే ఉన్నాయి. వలస కూలీలు ప్రైవేటు వాహనాల్ని ఆశ్రయిస్తున్నారు. రైల్వేస్టేషన్‌ ప్రాంగణాలు, వాటికి దారితీసే రహదారులు, నగరంలోని వివిధ ప్రాంతాల్లో కనిపించిన వలస కూలీలను ‘ఈనాడు’ ప్రతినిధి కదిలించగా తమ కన్నీటి గాధల్ని ఏకరువు పెట్టారు.

రాష్ట్రంలో వలస కూలీల వివరాలు ....

  • రెండు దఫాల సర్వేలో గుర్తించిన వలస కూలీలు: 7 లక్షల మంది
  • సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు అందిన దరఖాస్తులు: 2.51 లక్షలు
  • ప్రభుత్వ అనుమతి పొంది రైళ్లు, ఇతర మార్గాల ద్వారా వెళ్లిన వారు: 66,959

వాహనం అద్దె రూ.90 వేలకు బేరం

వీరు ఒడిశాకు చెందిన వలస కూలీలు. హైదరాబాద్‌లో వివిధ ప్రాంతాల్లో పనిచేస్తుంటారు. శుక్రవారం మధ్యాహ్నం సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు వెళ్లారు. రైలు ప్రయాణ ప్రయత్నం ఫలించకపోవడంతో అక్కడే ఫుట్‌పాత్‌పై సేద తీరారు. అనంతరం ఓ ప్రైవేటు వాహనంలో వెళ్లేందుకు మాట్లాడారు. 10 మందిని తీసుకెళ్లడానికి వాహన యజమాని రూ.1.10 లక్షలు అవుతుందని చెప్పాడు. బతిమిలాడితే రూ.90 వేలకు ఒప్పుకున్నాడు. వాళ్ల వద్ద ఉన్నది కొద్ది మొత్తమే. దీంతో కుటుంబ సభ్యుల నుంచి ఆన్‌లైన్‌లో డబ్బులు తెప్పించుకున్నారు. అయినా కిరాయిలో సగం మొత్తమే సమకూరింది. మిగిలిన డబ్బు ఒడిశా వెళ్లాక ఇస్తామని బతిమాలుకున్నారు.

పూటగడవటం లేదు

‘మధ్యప్రదేశ్‌లోని ఝాన్సీకి వెళ్తున్నాం. కొంత దూరం నడుస్తూ.. మరికొంత దూరం లారీల్లో ప్రయాణించాం. వికారాబాద్‌ జిల్లా తాండూరు నుంచి మేడ్చల్‌దాకా వచ్చాం. ఛాట్‌బండార్‌ నడుపుతూ బతుకుతున్నాం. లాక్‌డౌన్‌తో జీవితం తలకిందులైంది. రోజుకు కనీసం రూ.200 సంపాదన ఉంటే తప్ప పూట గడవదు.ఇద్దరు పిల్లలతో అప్పుల పాలుకాలేక, మరోవైపు బండి నడవక ఇంటి అద్దె, ఖర్చులనుంచి బయటపడేందుకు సొంతూరు వెళ్తున్నా. నాలుగేళ్లు, ఏడాది వయసున్న పిల్లలతో ఎండను భరిస్తూ రోజంతా ప్రయాణం చేస్తేగానీ ఊరుచేరుకోలేం’ అని భానుప్రతాప్‌ తెలిపారు.

చేసిన పనికి పైసలిస్తే చాలు...

‘‘పనికోసం నా కుమార్తె సంధ్యతో కలిసి హైదరాబాద్‌ వచ్చా. భవన నిర్మాణ పనులు చేస్తున్నాం. వెళ్లినవారు తిరిగొస్తారో లేరోనని యజమాని కూలీలకు కొద్దిపైసలే ఇచ్చాడు. ఎల్బీనగర్‌ నుంచి మేడ్చల్‌కు తీసుకెళ్లేందుకు ఆటో వ్యక్తి రూ.3 వేలు అడిగిండు. అక్కడినుంచి లారీలో నాగ్‌పుర్‌కు అటునుంచి బాలాగఢ్‌కు వెళ్లాలి. ఉన్న పైసలు ఛార్జీలకే చాలవు. చేసిన పని పైసలన్నీ ఇస్తే సొంతూరిలో ఇబ్బంది లేకుండా కొన్నిరోజులైనా గడుస్తాయి. శనివారం సొంతూరుకు వెళుతున్నాం’’ అని మధ్యప్రదేశ్‌కు చెందిన మమత కన్నీటి పర్యంతమయ్యారు.

పసిగుడ్డుకు... వలస కష్టం

ఆ పసిగుడ్డు భూమిపై పడి నేటికి ఎనిమిది రోజులే. ఆ తల్లికి బాలింత నొప్పులూ మానలేదు. అయినా మహారాష్ట్రకు బయలుదేరారు. హైదరాబాద్‌లో ఈమె భర్త అర్జున్‌ కూలి పనులు చేస్తున్నాడు అతని భార్య సరోజ పాపకు జన్మనిచ్చింది. వీరి స్వగ్రామం గడ్చిరోలి జిల్లా డోరి బయలుదేరారు. లారీల్లో వెళ్లాలని కండ్లకోయ కూడలికి చేరుకున్నారు. వారిని గమనించిన మేడ్చల్‌ తహసీల్దారు సురేందర్‌ స్పందించి వారికి వైద్య పరీక్షలు చేయించారు. రాత్రి సమయానికి ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో కారు ఏర్పాటు చేసి స్వరాష్ట్రానికి పంపించారు.

రైలు ఛార్జీల డబ్బులే ఉన్నాయి

వీరు ఝార్ఖండ్‌ వలస కూలీలు. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు వచ్చిన వీరిని రైళ్లు లేవంటూ పోలీసులు రేతిఫైల్‌ బస్టాండ్‌ నుంచి వెనక్కి పంపించారు. తమ వద్ద ప్రైవేటు వాహనాల్లో వెళ్లేంత డబ్బు లేదంటూ వెనుదిరిగారు. శ్రామిక్‌ రైళ్లలో వెళ్లేందుకు దరఖాస్తు తీసుకోవడం లేదు. కొన్నిరోజులు పనిచేసి వచ్చే డబ్బుతో సొంతూరుకు వెళతామంటూ నాచారం వెళ్లారు..

సొంత ఖర్చులతో.. ప్రైవేటు వాహనాల్లో...

రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో 6 వేల మంది వలస కూలీలు సొంత రాష్ట్రాలకు వెళతామని దరఖాస్తు చేసుకున్నారు. ప్రత్యేక రైళ్లలో పంపేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినా రైళ్లు రాలేదు. తామే ఖర్చులు భరించుకుని వెళతామని చెప్పడంతో పోలీసులు అనుమతులిచ్చి ప్రైవేటు వాహనాలు ఏర్పాటు చేశారు. దాదాపు 1,500 మంది వలస కూలీలు ప్రైవేటు వాహనాల్లో తమ ఖర్చులతో యూపీ, బిహార్‌, ఛత్తీస్‌గఢ్‌, పశ్చిమబెంగాల్‌లకు వెళ్లారు.

చౌటుప్పల్‌లో 2,800 మంది దరఖాస్తు చేసుకుంటే శ్రామిక్‌ రైళ్లలో గురువారం నాటికి 355 మంది వెళ్లారు. మిగిలినవాళ్లలో కొందరు ప్రైవేటు వాహనాలు మాట్లాడుకుని సొంతూళ్లకు పయనమయ్యారు. తమ దగ్గరున్న కొద్ది డబ్బుకు తోడుగా తెలిసినవారు, దాతల నుంచి మరికొంత మొత్తం సమకూర్చుకుని 200 మందికి పైగా వెళ్లారు.

కంటి పాపలకు కావడి కట్టి..

వలస కార్మికుల కాలినడకలు కొనసాగుతూనే ఉన్నాయి. మండుటెండలో కాలికి బొబ్బలు కట్టంగా.. వందల కిలోమీటర్లు నడుచుకుంటూ స్వగ్రామాలకు వెళుతున్నారు. కడపలో మేస్త్రీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న బిహారీ అనే వ్యక్తి స్వస్థలం ఛత్తీస్‌గఢ్‌. ఈ నెల 7వ తేదీన తన కుటుంబ సభ్యులు ఎనిమిది మందితో కలిసి కడప నుంచి కాలినడకన బయలుదేరారు. తమ చిన్నారుల కన్నీళ్లు చూడలేక కావడి కట్టి మోసుకెళ్తున్నాడు. హైదరాబాద్‌ నుంచి ఛత్తీస్‌గఢ్‌ వెళ్తామని చెప్పారు. ఎమ్మిగనూరులో వీరి పరిస్థితి గమనించిన కానిస్టేబుల్‌ జగదీష్‌ ప్రత్యేక వాహనంలో కర్నూలుకు పంపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.