రైళ్ల జాడ తెలుసుకునే నేషనల్ ట్రైన్ ఎంక్వైరీ సిస్టమ్ (ఎన్టీఈఎస్)లో శ్రామిక్ రైళ్ల వివరాల్ని నమోదుచేయకుండా రైల్వే అధికారులు అత్యంత గోప్యత పాటిస్తున్నారు. ఏప్రిల్ 14న ముంబయిలోని బాంద్రాస్టేషన్‌కు వేలాది వలసకూలీలు ఒక్కసారిగా వచ్చి తమ సొంతూళ్లకు పంపించాలని ఆందోళన చేసిన నేపథ్యంలో ఇటు రాష్ట్ర పోలీసులు, అటు రైల్వేశాఖ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. తాజాగా శనివారం రోజు పటాన్‌చెరు దగ్గరలోని నాగులపల్లిస్టేషన్ నుంచి కూడా మొట్టమొదటి సారి రైళ్లు ప్రారంభమయ్యాయి. రెండు రైళ్లలో వలసకార్మికులు బయల్దేరి వెళ్లారు. 9వ తేదీ వరకు 24 శ్రామిక్ రైళ్లలో తరలివెళ్లిన వలస కార్మికుల సంఖ్య 28 వేలు దాటింది.
ఆలస్యంగా బయల్దేరిన రైళ్లు
నాగులపల్లి నుంచి ఝార్ఖండ్‌లోని బొకారో స్టీల్‌సిటీ రైల్వేస్టేషన్‌కు శ్రామిక్‌రైలు (నెం.07022) 24 బోగీలతో శనివారం రాత్రి 9 గంటలకు వెళ్లింది. 7 గంటలకు బయల్దేరాల్సి ఉన్నప్పటికీ వలసకార్మికుల తరలింపు, ఆరోగ్యపరీక్షల్లో జాప్యం జరిగింది. ఇదే స్టేషన్ నుంచి మరో రైలు (నెం.07023) రెండు గంటలు ఆలస్యంగా అర్ధరాత్రి బయల్దేరి బిహార్‌లోని భాగల్పూర్‌కు 24 బోగీలతో వెళ్లింది. నిర్వహణ అవసరమైనచోట తప్పిస్తే.. ఈ రెండు రైళ్లు ఎక్కడా ఆగకుండా గమ్యస్థానం చేరుకోవాలని.. తిరుగుప్రయాణంలో బోగీలకు తాళం వేసి ఖాళీగా తీసుకురావాలని దక్షిణమధ్యరైల్వే స్పష్టం చేసింది.
రైల్వే అధికారులతో పోలీసుల సమాలోచన
శ్రామిక్’ రైళ్లు నిండిపోతుండడం.. ఫంక్షన్‌హాళ్లు, క్యాంపులలో ఉంటున్న వలస కార్మికుల నమోదు నిలిపేయడంతో వస్తున్న పరిణామాలపై పోలీసు ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. స్వస్థలాలకు వెళ్లేందుకు ఆలస్యమవుతుండటంతో కూలీలు చేస్తున్న ఆందోళనలు, నిరసనలను పరిగణనలోకి తీసుకుని ప్రత్యేక రైళ్లలో వారిని క్షేమంగా పంపించేందుకు కార్యాచరణ రూపొందించారు. రాష్ట్రవ్యాప్తంగా గురువారం వరకు 3.17లక్షల మంది వలస కార్మికులు పేర్లు నమోదు చేసుకున్నారు. అందులో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధుల్లోనే 2.70 లక్షల మంది ఉన్నారు. వీరిని ‘శ్రామిక్’ రైళ్లలో పంపించేందుకు ఎన్ని రైళ్లు అవసరమవుతాయి? ఎన్ని రోజుల వ్యవధి అవసరమనే అంశాలపై కసరత్తు చేస్తున్నారు. పోలీస్ ఠాణాల్లో నమోదు చేసుకున్న వారందరినీ పంపించాలంటే కనీసం వారం రోజులు పడుతుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. పెద్ద నిర్మాణ సంస్థల్లో పనిచేస్తున్న వారు.. సొంతూళ్ల నుంచి డబ్బు తెప్పించుకున్నవారు.. స్వయంగా బస్సులు, ఇతర వాహనాలు సమకూర్చుకుంటామంటూ పోలీసులకు చెబితే వారికి పాస్‌లు మంజూరు చేస్తున్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లోని ఐదు డీసీపీ కార్యాలయాల్లో అంతర్రాష్ట్ర పాస్‌లు కూలీలకు ఇస్తున్నారు. ఇక రైళ్లలో వెళ్లేంత వరకూ ఇక్కడే ఉంటున్న వారికి పోలీసులు వసతి సౌకర్యాలు కల్పిస్తున్నారు. భోజనాలకు ఎలాంటి ఇబ్బంది పడవద్దని, తమను సంప్రదించాలని చెబుతున్నారు.
యాదాద్రి థర్మల్ ప్లాంట్ నుంచి...
యాదాద్రి థర్మల్ విద్యుత్తు ప్లాంటు నుంచి శనివారం ఏపీ, ఒడిశాకు చెందిన 60 మందిని అధికారులు ప్రైవేటు వాహనాలలో తరలించారు. ఛత్తీస్‌గఢ్, యూపీ, ఝార్ఖండ్, పశ్చిమబెంగాల్‌కు చెందిన 104 మందిని మూడు ఆర్టీసీ బస్సులలో హైదరాబాద్‌కు తరలించారు. వీరు అక్కడి నుంచి రైలుమార్గం ద్వారా స్వస్థలాలకు వెళ్లనున్నారు.