- 64 శాతం- చేతిలో రూ.100 కన్నా తక్కువ మొత్తం ఉన్న కార్మికులు
- 70 శాతం- ఒకరోజుకీ సరిపడే రేషన్ లేనివారు
- 93శాతం- ప్రభుత్వం నుంచి రేషన్ అందనివారు
- 97శాతం- సర్కారు నుంచి ఎలాంటి సహాయం పొందనివారు
ఇదీ దేశవ్యాప్తంగా వలస కార్మికుల ప్రస్తుత పరిస్థితి.కరోనా నేపథ్యంలో వారి స్థితిగతులపై స్టాండెడ్ వర్కర్స్ అసోసియేషన్ నెట్‌వర్క్ అధ్యయనం చేసింది. వారి జీవితాలు ఎంత దుర్భరంగా ఉన్నాయో ఆవిష్కరించింది. వారి వేదనను తెలియజేసింది.
కరోనా కష్టకాలంలో వలస కార్మికులకు కన్నీళ్లు తప్పడం లేదు. దాదాపు 92 శాతం మంది వలస కూలీలకు యాజమాన్యాలు జీతాలు, కూలి చెల్లించలేదని స్టాండెడ్ వర్కర్స్ అసోసియేషన్ నెట్‌వర్క్ అధ్యయనంలో వెల్లడైంది. దేశవ్యాప్తంగా కార్మికుల కష్టాలు, సమస్యలను అధ్యయనం చేస్తున్న ఈ సంస్థ పలు విషయాలు ప్రకటించింది. కార్మికులపై బ్యాంకులూ పడ్డాయి. ఖాతాల్లో కనీస నిల్వ లేదంటూ జరిమానాలు విధించాయంది. గరిష్ఠంగా బ్యాంకులు రూ.499 వరకు ఛార్జీలు వేశాయి. సొంత గ్రామాలకు చేరుకునేందుకు చాలాచోట్ల కార్మికులు తెలిసిన బంధువులు, స్నేహితుల ద్వారా అప్పు కింద స్వల్ప మొత్తాలు తీసుకుంటున్నారు. మరికొందరు కాలినడకన పయనమవుతున్నారు.
అప్పటివరకు కూడబెట్టిన డబ్బు... లాక్‌డౌన్‌లో పనులు లేకపోవడంతో తినడానికి ఖర్చయ్యాయి. సొంత గ్రామాలకు వెళ్లేందుకు 78 శాతం మందికి సరిపడా డబ్బులేదని అధ్యయనం వెల్లడించింది. ఇంటికి వెళ్తే అప్పుల బాధలు పెరుగుతాయని, ఇక్కడే ఉండి డబ్బు సంపాదించాకనే వెళ్లాలని మరికొందరు భావిస్తున్నారు. లాక్‌డౌన్ ముగిశాక పాత యజమానుల వద్ద పనిచేస్తామని 30 శాతం మంది వివరించారు. మరో 30 శాతం మంది ఏమి చేయాలన్న విషయమై నిర్ణయించుకోలేదని అధ్యయనం తెలిపింది. స్వస్థలాలకు వెళ్లిన తరువాత అక్కడే ఏదో ఒక పనిచేసుకుని బతకాలని 16 శాతం మంది భావిస్తున్నారు.ఒకేదేశం-ఒకేకార్డు విధానం లేకపోవడంతో వలస కార్మికులకు ప్రభుత్వం నుంచి రేషన్ అందలేదని సర్వే వివరించింది.
పునరావాస కేంద్రాలు కొనసాగించాలి
వలస కార్మికుల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలు కొనసాగించాలని అధ్యయన సంస్థ సూచించింది. వారికి మూడునెలలు ఉచిత రేషన్ అందించాలని, పప్పులు, నూనె, ఉప్పు, మసాలా, సబ్బులు, శానిటరీ నాప్కిన్స్ సరఫరా చేయాలని పేర్కొంది. లాక్‌డౌన్ తర్వాత కూడా 12 గంటలు ఆహార కేంద్రాలు కొనసాగించాలంది. కార్మికులకు వేతన పరిహారం కల్పించాలని కోరింది.
పసి‘వాడి’ పోతున్నారు!
‘40 డిగ్రీల సెల్సియస్ ఎండ. వడగాడ్పులు. ఇళ్లలో ఉన్నవారే వేడికి అల్లాడి పోతుండగా.. సొంత రాష్ట్రాలకు బయలుదేరిన వలస కూలీల కుటుంబాల్లోని చిన్నారులు రహదారులపై డస్సి పోతున్నారు. పలు జిల్లాలు, నగరం నుంచి సొంత రాష్ట్రాలకు తరలిపోతున్న వలస జీవులకు వారి పిల్లల రక్షణ సవాలుగా మారింది. శనివారం రాత్రి నుంచి ఆదివారం సాయంత్రం వరకు పలు ప్రాంతాల నుంచి హైదరాబాద్-నాగ్‌పుర్ జాతీయ రహదారిపైకి (మేడ్చల్, కండ్లకోయ కూడళ్లకు) వచ్చిన కుటుంబాల్లో పిల్లలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. కొందరిని ఫంక్షన్‌హాళ్లకు తరలించగా మరికొందరు లారీల్లో తరలిపోయారు. వాహనాలను పోలీసులు మధ్యలో ఆపేస్తుండటం, కూలీలను పంక్షన్ హాళ్లకు తరలిస్తుండటంతో చిన్నారులకు భోజనం కూడా పెట్టలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయని తల్లిదండ్రులు వాపోతున్నారు. త్వరగా తమ రాష్ట్రాలకు చేరుకునేలా సహకరించాలంటూ చిన్నారుల తల్లిదండ్రులు స్థానికంగా ఉన్న స్వచ్ఛంద సంస్థలు, అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. కొందరు కూలీలు ఉమ్మడిగా ఒక్కో లారీకి రూ.1.30 లక్షల వరకు చెల్లించి.. సొంతూళ్లకు బయలుదేరుతున్నారు.
ఇదీ చదవండి:కరోనా వేళ... పోషకాహారంతో రక్షణ