విద్య, సాంకేతిక, పరిశోధన తదితర అంశాలపై పరస్పర సహాకారం కోసం తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి, యూకేలోని వేల్స్ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఛైర్మన్ తుమ్మల పాపిరెడ్డి, బ్రిటిష్ కౌన్సిల్ భారత్ సంచాలకురాలు బార్బారా విక్‌హామ్ ఎంఓయూ పత్రాలను మార్చుకున్నారు.
ఈ ఒప్పందం మూడేళ్ల పాటు అమల్లో ఉంటుందని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి తెలిపారు. రెండేళ్ల క్రితం బ్రిటిష్ కౌన్సిల్ దక్షిణాది విభాగంతో ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా కామర్స్, సోషల్ సెన్స్‌లో సిలబస్ మార్పుపై ప్రాజెక్టు చేపట్టామని, దాన్ని త్వరలో ప్రారంభిస్తామని ఉన్నత విద్యామండలి ఉపాధ్యక్షుడు ఆచార్య లింబాద్రి తెలిపారు. అక్కడి బోధనా సిబ్బంది మన దేశం వచ్చేందుకు, వారికి అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు ఉన్నత విద్యామండలికి ఇప్పటికే బ్రిటిష్ కౌన్సిల్ రూ.90 లక్షలు మంజూరు చేసిందన్నారు.
వేల్స్ విద్యాశాఖ మంత్రి కిర్‌స్టీ విలియమ్స్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉన్నత విద్యామండలి కార్యదర్శి శ్రీనివాసరావు, బ్రిటిష్ కౌన్సిల్ దక్షిణాది విభాగం సంచాలకురాలు జనక పుష్పనాథన్ తదితరులు పాల్గొన్నారు.