హైదరాబాద్ జలసౌధ వేదికగా జరిగిన గోదావరి-కావేరి అనుసంధానంపై(Godavari Kaveri River linking project) సమావేశం ముగిసింది. సమావేశంలో తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్, ఇంజినీర్లు పాల్గొన్నారు. దృశ్యమాధ్యమం ద్వారా భేటీలో 8 రాష్ట్రాల అధికారులు పాల్గొన్నారు. గోదావరి- కావేరి అనుసంధానానికి(Godavari Kaveri River linking project) కసరత్తులు జరుగుతున్నాయని ఎన్‌డబ్ల్యూడీఏ డీజీ భోపాల్ సింగ్ అన్నారు. హిమాలయ బేసిన్ మిగులు జలాలు తేవాలన్న ఆలోచన ఉన్నట్లు తెలిపారు. అన్ని రాష్ట్రాలకు డీపీఆర్ రూపొందించామని వెల్లడించారు. డీపీఆర్‌పై రాష్ట్రాల ఏకాభిప్రాయం కోసం యత్నిస్తున్నామని చెప్పారు. పది రాష్ట్రాల అభిప్రాయాల కోసం సమావేశం నిర్వహించినట్లు పేర్కొన్నారు.
సానుకూల వాతావరణంలో సమావేశం జరిగిందని భోపాల్ సింగ్ తెలిపారు. కృష్ణా, పెన్నా, కావేరి బేసిన్‌లోని నీటి లోటుకు కసరత్తు చేస్తున్నట్లు వివరించారు. పది లక్షల హెక్టార్లకు సాగునీరు ఇచ్చేలా ప్రణాళికలు చేశామన్నారు. రూ.87వేలకోట్ల అంచనాతో అనుసంధాన ప్రాజెక్టు ఉంటుందని స్పష్టం చేశారు. అభిప్రాయాలు, వివరాలను నెలలోగా అన్ని రాష్ట్రాలను కోరామన్నారు. వివరాల తర్వాతే తదుపరి ప్రక్రియ ఉంటుందని తెలిపారు. కచ్చితమైన అధ్యయనం జరగాలని తెలంగాణ కోరిందన్నారు. తమ వాటాకు భంగం కలగరాదని ఏపీ కోరిందన్నారు.