Medigadda Barrage Issue : మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల పునరుద్ధరణ పనులకు సంబంధించిన నైపుణ్యం తమ వద్ద లేదని తెలంగాణ సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ తెలిపింది. దేశవ్యాప్తంగా గుర్తింపు ఉన్న, అత్యాధునిక సామర్థ్యం ఉన్న సంస్థలను ఎంపిక చేసి రక్షణకు సంబంధించిన డిజైన్లు తీసుకోండని స్పష్టం చేసింది. కేంద్ర జల సంఘం లేదా ఐఐటీలను ఎంపిక చేసి ఇన్వెస్టిగేషన్, డిజైన్, పునరుద్ధరణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సీడీవో సూచించింది.
Annaram Barrage Issue : మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లతోపాటు తెలంగాణలోని భారీ, మధ్యతరహా ప్రాజెక్టులకు సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ డిజైన్లు ఇచ్చింది. తాజాగా మేడిగడ్డ బ్యారేజీ (Medigadda Barrage)కుంగి పియర్స్ దెబ్బతినడం, అన్నారంలో సీపేజీ ఏర్పడిన నేపథ్యంలో ఈ రెండింటి పునరుద్ధరణ పనులకు సంబంధించిన డిజైన్ సహా అన్నింటినీ వేరే సంస్థకు అప్పగించాలని సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ సూచించడం ప్రాధాన్యాన్ని సంతరించుకొంది.
'మేడిగడ్డ' ఘటనలో ఊహించని ట్విస్ట్ - పునరుద్ధరణ బాధ్యత ప్రభుత్వానిదే అంటూ నిర్మాణ సంస్థ లేఖ
నిర్మాణ సమయంలో ఇచ్చిన మోడల్ స్టడీస్‌కు, తర్వాత ఆనకట్ట నిర్వహణ తీరుకు పొంతన లేకపోవడం వల్లే సమస్యలు ఉత్పన్నమయ్యాయని సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ అభిప్రాయపడినట్లు తెలిసింది. 2016 నుంచి ఇప్పటివరకు కాళేశ్వరం ఇంజినీర్ ఇన్ చీఫ్(రామగుండం)తో జరిపిన సుమారు 25కు పైగా ఉత్తరప్రత్యుత్తరాలను కూడా, సీడీవో చీఫ్ ఇంజినీర్ మోహన్‌కుమార్ జత చేశారు.
Telangana CDO on Medigadda Barrage Restoration : బ్యారేజీ నిర్వహణలో వరద తగ్గుముఖం పట్టినపుడు గేట్లు మూసి నీటిని నిల్వ చేస్తారని సీడీవో ఇంజినీర్లు, ప్రాజెక్టు ఉన్నతస్థాయి ఇంజినీర్లకు తెలిపారు. అయితే మేడిగడ్డలో గేట్లను పూర్తిగా మూసి నీటిమట్టం పూర్తి స్థాయికి వచ్చిన తర్వాత గేట్లు ఎత్తి నీటిని వదిలారని చెప్పారు. దీనివల్ల నీటి వేగం(వెలాసిటీ)లో మార్పు వచ్చిందని వివరించారు. దిగువ భాగంలో ఆప్రాన్(కాంక్రీటు నిర్మాణం) దాటి నీళ్లు పడటం వల్ల సమస్య వచ్చిందని అన్నారు. తాము చేసిన డిజైన్‌కు, బ్యారేజీ నిర్వహణకు పొంతన లేకుండా పోయిందని సీడీవో ఇంజినీర్లు ప్రాజెక్టు ఉన్నతస్థాయి ఇంజినీర్లకు స్పష్టం చేసినట్లు తెలిసింది.
మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలపై పర్యావరణ నిపుణుల హెచ్చరిక
Telangana CDO on Annaram Barrage Restoration : గత వారం అన్నారం, మేడిగడ్డ ఆనకట్టల డిజైన్లపై సీడీవో ఇంజినీర్లు వివరణాత్మకంగా లేఖ రాశారు. నిర్మాణం ప్రారంభం కాకముందు నుంచి తాజా వైఫల్యం వరకు అన్ని అంశాలను అందులో పొందుపరిచారు. మోడల్ స్టడీస్ ఫలితాలు పూర్తిగా రాకుండానే, డిజైన్లు తీసుకొన్నట్లు దీనిని బట్టి స్పష్టమవుతోందని ఇంజినీరింగ్ వర్గాలు తెలిపాయి. మోడల్ స్టడీస్ పెండింగ్‌లో ఉండగానే, రాఫ్ట్ నిర్మాణానికి సంబంధించిన డిజైన్లను సీడీవో ఇచ్చినట్లు సమాచారం.
సీడీవో ఆమోదించిన డ్రాయింగ్స్, మోడల్ స్టడీస్ ద్వారా వచ్చే ఫలితాల ఆధారంగా ఉంటాయని పేర్కొంది. అయితే గోదావరిపై నిర్మించే ఇలాంటి ఆనకట్టలకు మోడల్ స్టడీస్‌కు సంబంధించి పూర్తి ఫలితాలు రాకుండానే, డిజైన్లు తీసుకొని సంబంధిత ఇంజినీర్లు గుత్తేదారులతో పనులు మొదలుపెట్టించినట్లు వీటిని బట్టి స్పష్టమవుతోందని ఇంజినీరింగ్ వర్గాలు తెలిపాయి. నీటి మట్టం ఎక్కువగా ఉన్నప్పుడు వేగాన్ని తగ్గించడానికి (ఎనర్జీ డిస్‌పేషన్ అరెంజ్‌మెంట్స్) బ్యారేజీ దిగువన సిల్లింగ్ బేసిన్ పొడవు, వెడల్పు మోడల్ స్టడీస్ ద్వారా డిజైన్ చేయాల్సి ఉంటుందని పేర్కొన్నాయి.
ఉండాల్సినంతగానే గరిష్ఠ వరద ప్రవాహం : మోడల్ స్టడీస్ తుది ఫలితాలు వచ్చినపుడు ఒక బ్యారేజీలో గరిష్ఠ వేగం 3.6 మీటర్/సెకండ్‌గా నమోదైందని సీడీవో ఇంజినీర్లు లేఖలో పేర్కొన్నారు. ఇది అనుమతించిన పరిధిలోనే ఉందని చెప్పారు. మరో సంవత్సరం తర్వాత త్రీడీ మోడల్ స్టడీస్ చేయించినపుడు దీనికి రెండింతలు వేగం నమోదైందని తెలిపారు. అది కూడా గరిష్ఠ వరద ప్రవాహం ఉన్నప్పుడు ఉండాల్సినంతగానే ఉందని సీడీవో పేర్కొన్నట్లు తెలిసింది. అయితే ఇది చాలా ఎక్కువని డ్యాం సేఫ్టీ, డిజైన్‌లో అనుభవం ఉన్న ఓ సీనియర్ ఇంజినీర్ అభిప్రాయపడ్డారు.
అన్నారం బ్యారేజీని పరిశీలించిన కేంద్ర డ్యాంసేఫ్టీ బృందం
చర్చనీయాంశంగా సీడీవో లేఖ : మోడల్ స్టడీస్‌కు ఇచ్చినపుడు కూడా, సంబంధిత ఇంజినీర్లు బ్యారేజీ నిర్వహణ ఎలా ఉంటుందన్న వివరాలు అందజేయలేదని సమాచారం. మొత్తం మీద తాజాగా తమ వల్ల కాదని, ఎక్కువ నైపుణ్యం గల సంస్థను ఎంపిక చేసుకొని డిజైన్లు, పునరుద్ధరణ పనులు చేయించమని సీడీవో లేఖ రాయడం చర్చకు దారి తీసింది.
కాళేశ్వరం 3 బ్యారేజీల్లోని నీళ్లన్నీ ఖాళీ చేయాల్సిందే! : నీటిపారుదల శాఖ
వర్షాకాలంలోగా మేడిగడ్డ పునరుద్ధరణ కష్టమే - ఆందోళనలో నీటిపారుదల శాఖ